అయోధ్య నగరం దీపోత్సవం వేడుకలతో భక్తి, సాంప్రదాయ, సాంస్కృతిక మహోత్సవానికి వేదికగా మారింది. ఈ వేడుకల్లో మయన్మార్, నేపాల్, థాయ్‌లాండ్, మలేషియా, కాంబోడియా, ఇండోనేషియా వంటి దేశాలకు చెందిన కళాకారులు ప్రదర్శనలు ఇవ్వడం విశేషం. రామ్ లీలా ప్రదర్శనతో పాటు ప్రత్యేక కళారూపాలు, సాంప్రదాయ నృత్యాలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమాల్లో భారతదేశం నలుమూలల నుండి కళాకారులు పాల్గొని వేదికను రంజింపజేశారు.
బుధవారం తెల్లవారుజామున ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ దీపోత్సవం హారతిని స్వీకరించారు. కార్యక్రమంలో భాగంగా ఆయన కళాకారుల చేత నిర్మితమైన రథాన్ని లాగడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రామమందిరం ప్రాణప్రతిష్ఠ అనంతరం జరుగుతున్న తొలి దీపోత్సవం కావడంతో ఈ ఉత్సవాలను ప్రత్యేకమైన ఆధ్యాత్మిక వైభవంతో నిర్వహించారు. దీపోత్సవ వేడుకల్లో భాగంగా ఏకంగా 25 లక్షల మట్టి ప్రమిదల్లో దీపాలను వెలిగించారు.