హైదరాబాద్: ఈ రోజు నాంపల్లి ప్రత్యేక కోర్టులో మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై హీరో నాగార్జున, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం కేసు విచారణ జరిగింది. కొండా సురేఖ తరఫున న్యాయవాది గురుమిత్‌సింగ్ కోర్టుకు హాజరయ్యారు. నాగార్జునకు చెందిన పరువునష్టం దావాతో పాటు కేటీఆర్ పెట్టిన పిటిషన్‌ను కోర్టు నవంబర్ 13కు వాయిదా వేసింది. నాంపల్లి స్పెషల్ మెజిస్ట్రేట్ కోర్టు విచారణ మేజిస్ట్రేట్ సెలవులో ఉండటంతో కేసు విచారణను ఇంచార్జి న్యాయమూర్తి నవంబర్ 13కు వాయిదా వేశారు. కొండా సురేఖ ఇటీవల తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు.
కాగా, ఈ మధ్య, కొండా సురేఖకు 100 కోట్ల పరువు నష్టం కేసు దాఖలు చేసిన బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ కేసు విషయంలో కోర్టు ఆమెపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆమె వ్యాఖ్యలు నిరుత్సాహకరంగా ఉన్నాయని కోర్టు పేర్కొంది. ఓ బాధ్యత గల మహిళా మంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనుకోని విషయం అని కోర్టు పేర్కొంది. కేటీఆర్‌పై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు సీరియస్ అయింది.
కొండా సురేఖకు, భవిష్యత్తులో కేటీఆర్ సహా ఇతర నాయకులపై ఇలాంటి వ్యాఖ్యలు చేయవద్దని కోర్టు ఆదేశించింది. కేటీఆర్‌పై ఆమె చేసిన వ్యాఖ్యలను వెంటనే మీడియా మరియు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. యూట్యూబ్, ఫేస్‌బుక్, గూగుల్ వంటి సంస్థలకు కూడా ఇలాంటి వీడియోలను తొలగించాలనే ఆదేశాలు ఇచ్చింది.
కొండా సురేఖ వ్యాఖ్యలను ప్రసారం చేసిన మీడియా సంస్థలకు కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కామెంట్లకు సంబంధించిన అన్ని కథనాలను సోషల్ మీడియా నుండి తొలగించాలని ఆదేశించింది. ఆమె వ్యాఖ్యలు సమాజంలో చెడు ప్రభావాన్ని చూపుతాయని, అందువల్ల అన్ని కథనాలు మరియు వీడియోలు పబ్లిక్ డొమైన్‌లో ఉండకూడదని కోర్టు స్పష్టం చేసింది. గతంలో కూడా కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది మరియు ఇలాంటి వ్యాఖ్యలు చేయవద్దని హెచ్చరించింది.