న్యూఢిల్లీ: రానున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ తిరిగి అధికారంలోకి రాగానే పెరిగిన నీటి బిల్లులను మాఫీ చేస్తామని ఆప్ జాతీయ కన్వీనర్, మాజీ ముఖ్యమంతి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. వాజీపూర్‌లో నిర్వహించిన పాదయాత్రలో ఆయన ఈ విషయాలను వెల్లడించారు. తనను మరోసారి ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటే, గతంలో విడుదలైన నీటి బిల్లులను మాఫీ చేస్తానని ఢిల్లీ ప్రజలకు హామీ ఇచ్చారు. నీటి బిల్లులు అధికంగా ఉన్నవారికి చెల్లించాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. ఫిబ్రవరిలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు తరువాత, మార్చిలో వచ్చే వాటర్ బిల్లులను మాఫీ చేస్తామని పేర్కొన్నారు. బీజేపీకి ఓటు వేస్తే, తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు, ముఖ్యంగా విద్యుత్ మరియు నీటికి సంబంధించిన పథకాలు నిలిపివేస్తాయంటూ హెచ్చరించారు.
మరోవైపు కేజ్రీవాల్ వ్యాఖ్యలపై ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్‌దేవా ఘాటుగా స్పందించారు. అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఓటమిని పసిగట్టిన మాజీ ముఖ్యమంత్రి తన ప్రకటనల ద్వారా ప్రజల మనసుల్లో భయాన్ని నింపేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వాలు అత్యుత్తమ సామాజిక సంక్షేమ రాయితీలు ఇస్తున్నాయని ప్రజలకు బాగా తెలుసు. విద్యుత్ సబ్సిడీ కొనసాగుతుందని, దాని ప్రయోజనం మధ్యతరగతి వినియోగదారులకు కూడా వర్తిస్తుందని తాము పదేపదే చెబుతున్నామని సచ్‌దేవా చెప్పారు. “మేము స్వచ్ఛమైన నీటిని కూడా సరఫరా చేస్తాము,” ఆయన అన్నారు.