మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇటీవల తన సోషల్ మీడియా ఖాతా Xలో ఒక వీడియో పోస్ట్ చేస్తూ, విద్యుత్ ఛార్జీల పెంపుదలపై చంద్రబాబు నాయుడికి సంబంధించిన పాత వ్యాఖ్యలను గుర్తుచేశారు. అందులో, చంద్రబాబు ఎన్నికల ముందు “రాబోయే ఐదేళ్లలో విద్యుత్ ఛార్జీలు పెంచను” అని ప్రజలకు హామీ ఇచ్చిన వీడియోను షేర్ చేశారు. దీనితోపాటు, జగన్ చంద్రబాబును ట్యాగ్ చేస్తూ, ఈ హామీని ప్రజలు మరిచిపోలేదని గుర్తుచేసేలా వ్యాఖ్యానించారు.
జగన్ పోస్ట్ చేసిన ఈ వీడియోపై రాజకీయ వర్గాల్లో మళ్లీ చర్చలు మొదలయ్యాయి. గతంలో చంద్రబాబు ఇచ్చిన హామీకి వ్యతిరేకంగా విద్యుత్ ఛార్జీలు పెరిగిన సందర్భాలను జగన్ ప్రస్తావిస్తూ, ప్రజలకు ఇచ్చిన మాటపై నిలబడాల్సిన అవసరాన్ని గుర్తుచేశారు. జగన్ పోస్టులో ప్రజలపై పెరుగుతున్న బారం, విద్యుత్ ఛార్జీల భారం సామాన్య జనానికి ఇబ్బంది కలిగిస్తుందని స్పష్టంగా చెప్పడం గమనార్హం.
ఇదిలా ఉండగా, జగన్ ఎప్పటికప్పుడు ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తూ, ప్రత్యేకించి ఎన్నికల హామీలను గుర్తుచేస్తూ సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేయడం సాధారణమైపోయింది. ఈ తాజా వ్యాఖ్యలపై టీడీపీ నుంచి కూడా అదే రేంజ్ రియాక్షన్ వస్తుందని భావిస్తున్నారు.