సినీనటుడు ప్రకాశ్ రాజ్ సోషల్ మీడియాలో తరచూ “JustAsking” అని ప్రత్యేక పోస్టులు చేస్తుంటారు. ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్‌లో ఈ విషయంపై ఆయన స్పందిస్తూ, ప్రశ్నలు ఎందుకు అడుగుతారన్నదానికి క్లారిటీ ఇచ్చారు. “సమాధానాలు చెప్పని ప్రశ్నలను అడగడమే నా లక్ష్యం,” అని ఆయన స్పష్టం చేశారు. మిగతా నటులు తమ సినిమాలు, పనుల్లో నిమగ్నంగా ఉంటే, తాను మాత్రం మౌనంగా ఉండలేనని, ఎందుకంటే తాను తన ఉనికిని అర్థవంతం చేసుకోవాలని కోరుకుంటున్నానని తెలిపారు.
ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ, “నన్ను ప్రజలు నమ్మారు, ప్రేమించారు, అందుకే వారి సమస్యలకు ప్రతినిధిగా నిలబడటం నా బాధ్యత,” అన్నారు. నేరాలు చేసిన వాళ్ళను చరిత్ర మర్చిపోకపోయినా, తప్పులు చూసి మౌనంగా ఉండేవాళ్ళను సమాజం ఎప్పటికీ క్షమించదని అన్నారు.
కాలేజీ రోజుల్లో ప్రేరణ పొందిన రచయితలు, ఆలోచనాధారులు, మరియు లంకేష్ వంటి ఎడిటర్లతో కలిసి ఆయన అనేక అనుభవాలు పొందినట్లు చెప్పారు. అలాంటి అనుభవాలే తనలో ఆలోచనా శక్తిని పెంచాయని, సమాజ సమస్యలపై స్పందించే ధైర్యాన్ని కలిగించాయని పేర్కొన్నారు. “నన్ను ఒంటరిగా చేసే అనేక సమస్యలు ఉన్నా, వాటిని అధిగమించి పోరాడినప్పుడే నా లక్ష్యం నెరవేరుతుంది” అని ప్రకాష్ రాజ్ ఉద్వేగభరితంగా చెప్పుకొచ్చారు.