నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరించే ‘అన్ స్టాపబుల్’ షో నాలుగో సీజన్ ప్రారంభంలోనే పెద్ద మేజర్ సీన్లతో మొదలైంది. ఈ సీజన్ ప్రారంభ ఎపిసోడ్ లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గెస్ట్ గా హాజరై తన జైలు అనుభవం గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ షోకి హాజరైన చంద్రబాబు, ప్రస్తుతం ముఖ్యమంత్రి హోదాలో మరొకసారి ఈ షోకి హాజరయ్యారు.
చంద్రబాబు తాను జైలుకు వెళ్లిన అనుభవాన్ని నిశితంగా వివరించారు. నంద్యాలలో ఎటువంటి నోటీసులు లేకుండా అరెస్ట్ వారెంట్ జారీ చేయడం, దర్యాప్తు పేరుతో రాత్రంతా తిప్పడం, కోర్టు విచారణ అనంతరం అర్ధరాత్రి వేళ జైలుకు తరలించడం వంటి అనుభవాలను గుర్తుచేశారు. ఈ సందర్భంలోనే పవన్ కల్యాణ్ తనను జైలులో కలవడం, కూటమిపై తమ మధ్య చర్చలు జరిగిన విషయాలను కూడా పంచుకున్నారు.
జైల్లో ఉన్న సమయంలో తన కుటుంబం, తనకు సపోర్ట్ చేసిన అభిమానులు, కార్యకర్తలు మరియు ప్రజల ప్రేమ, వారిని కలుసుకున్న తర్వాత కలిగిన సంతోషం గురించి ప్రస్తావించారు. జైలు జీవితం రాజకీయ నాయకులకు మాత్రమే కాదు, ప్రజాప్రతినిధులకూ ఒక ముఖ్యమైన పాఠంగా ఉంటుందని భావిస్తున్నట్లు చంద్రబాబు వ్యాఖ్యానించారు.
సంక్లిష్ట పరిస్థితుల్లో నిబ్బరం, ధైర్యం కోల్పోకుండా ఉండటం మాత్రమే కాక, ప్రజల పట్ల మరింత జవాబుదారీతనం, కఠినతరం అవుతుందని ఈ అనుభవం తనకు నేర్పిందని వివరించారు. “తప్పు చేయనప్పుడు మనం ఎవరినీ భయపడాల్సిన అవసరం లేదు” అంటూ చంద్రబాబు ప్రస్తావించిన అంశం రాజకీయం అంటే కేవలం అధికారమే కాదు, కష్టసుఖాల్లో ప్రజలకు తోడు ఉండడం అనే సందేశాన్ని సూటిగా వినిపించింది.