తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. సియోల్ పర్యటన నుంచి వచ్చిన వెంటనే తెలంగాణలో పొలిటికల్ బాంబులు పేలబోతున్నాయని, నవంబర్ 1 నుంచి 8 వరకు కీలక నేతలు జైలు పాలవుతారని, తాము ల్యాండ్ కబ్జా మరియు ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో ఆధారాలతో సిద్ధంగా ఉన్నామని ఆయన హెచ్చరించారు. తాజాగా పొంగులేటి చేసిన వ్యాఖ్యలపై మంత్రి సీతక్క(Minister Seethakka) స్పందించారు. శుక్రవారం ఆమె ఓ మీడియా చానల్ ప్రతినిధితో మాట్లాడారు. నవంబర్‌లో బిఆర్ఎస్ కీలక నేతలు తప్పకుండా లోపలికి వెళ్తారని అన్నారు.
దీపావళి పండుగకు ముందే ఈ వివాదాలు పెద్ద దుమారాన్ని రేపుతాయని సూచన చేయడంతో పలువురు బీఆర్ఎస్ నేతలు ఆయన వ్యాఖ్యలపై స్పందించారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో కేటీఆర్ కూడా తనదైన శైలిలో స్పందిస్తూ, “తెలంగాణలో మంత్రి పొంగులేటి చేసిన బాంబు వ్యాఖ్యల వెనుక ఆయనపై జరిగిన ఈడీ దాడుల గురించి మాట్లాడటానికి ఆయన సిద్ధంగా ఉన్నారా? దాడుల్లో దొరికిన నోట్ల కట్టలు, పాముల విషయం చెప్తారా?” అంటూ సెటైర్లు వేశారు. కాంగ్రెస్ నేతలు కూడా కేటీఆర్ వ్యాఖ్యలపై తమ కౌంటర్లు ఇస్తూ, ఈ వ్యవహారం మరోసారి వివాదాస్పదంగా మారింది. ఇప్పటి వరకూ ఈ అంశంపై పలువురు రాజకీయ నాయకులు వివిధ అభిప్రాయాలు వ్యక్తం చేయడం, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారుతోంది.