న్యూఢిల్లీ: ఢిల్లీలో ఎన్డీటీవీ నిర్వహిస్తున్న సదస్సులో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..వివిధ రకాల సమస్యలతో సతమతం అవుతున్న ప్రపంచానికి భారత్ ఆశను కల్పిస్తోందని అన్నారు. భారత సర్కారు అసాధారణ రీతిలో పనిచేస్తోందని, ప్రతి రంగంలోనూ వేగం పెంచినట్లు ఆయన చెప్పారు. మూడవ సారి తాము అధికారంలోకి రావడం వల్ల భారత వృద్ధి రేటు వేగంగా జరుగుతున్నట్లు అనేక సంస్థలు అంచనా వేశాయన్నారు.
డబుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో భారత్‌కు అడ్వాంటేజ్ జరుగుతోందని, ఏఐ టెక్నాలజీతో పాటు ఆస్పిరేషనల్ ఇండియాగా దేశం మారుతోందన్నారు. దేశ ప్రజలు వికసిత్ భారత్ గురించి చర్చిస్తున్నట్లు ఆయన తెలిపారు. జన శక్తితో రాష్ట్ర శక్తి సాధిస్తున్నట్లు ఉందన్నారు. ఊహాజనితంగా సంబంధాలను పెంచుకోబోమని, తమ బంధాలన్నీ నమ్మకం, విశ్వాసం మీద ఆధారపడి ఉంటాయని ప్రధాని మోడీ తెలిపారు.
ప్రజాస్వామ్య విలువలు, డిజిటల్ ఇన్నోవేషన్.. సహజీవనం చేయగలవని భారత్ నిరూపించినట్లు ప్రధాని చెప్పారు. టెక్నాలజీతో సమగ్రత సాధించాలని, కానీ దాన్ని నియంత్రణకు, విభజనకు వాడరాదన్న ఉద్దేశాన్ని భారత్ చూపించినట్లు ప్రధాని తెలిపారు. తమ ప్రభుత్వానికి రెస్ట్ అనేది లేదని, భారత దేశ కలలను నిజం చేసే వరకు విశ్రమించబోమన్నారు.
ఈ కార్యక్రమానికి ముందు ఆయన సదస్సులో పాల్గొనడానికి వచ్చిన విదేశీ అతిథులను కలుసుకొన్నారు. రెండ్రోజుల పాటు జరగనున్న ఈ సదస్సులో యూకే మాజీ ప్రధాని డేవిడ్ కామరూన్, భూటాన్ ప్రధాని దాసో త్సేరింగ్ టోబ్గే, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, భారతీ ఎయిర్‌టెల్ ఛైర్మన్ సునీల్ మిత్తల్ తదితరులు పాల్గొననున్నారు.