న్యూఢిల్లీ: లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఈరోజు (శనివారం) జార్ఖండ్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. రాష్ట్ర రాజధాని రాంచీలోని శౌర్య ఆడిటోరియంలో జరిగే రాజ్యాంగ సదస్సులో పాల్గొననున్నారు. 500 మందికి పైగా ప్రతినిధులతో ఆయన మాట్లాడనున్నారు. జార్ఖండ్ పర్యటనలో రాహుల్ కాంగ్రెస్ పార్టీ నేతలతో కూడా భేటీ కానున్నారు. ఆ సమావేశం ముగిసిన తర్వాత ఇక్కడి నుంచి ఢిల్లీకి తిరిగి వెళ్లిన తర్వాత రేపు (అక్టోబర్ 20న) కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో జార్ఖండ్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై కీలక చర్చ జరగనుంది. జార్ఖండ్ రాష్ట్ర ఎన్నికల కమిటీ సమావేశం కాంగ్రెస్ ఆఫీసులో జరిగింది. అభ్యర్థుల పేర్లపై భేటీలో చర్చించారు. రాష్ట్ర ఇన్‌చార్జి గులాం అహ్మద్ మీర్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఇక, ఇండియా కూటమిలో సీట్ల సర్దుబాటు తర్వాత కాంగ్రెస్ తన అభ్యర్థుల జాబితాను ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం క్యాండిడెట్ల ఎంపిక ప్రక్రియలో నిమగ్నమై ఉన్నామని కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ చార్జి గులాం అహ్మద్ మీర్ మీడియాకు వెల్లడించారు. అభ్యర్థుల ఎంపిక పూర్తి పారదర్శకంగా కొనసాగుతుంది.. సీట్ల పంపకానికి సంబంధించి మూడు దఫాలుగా చర్చించాం.. రాష్ట్ర సీఎం హేమంత్ సోరెన్‌తో కూడా చర్చలు జరిగాయని ఆయన అన్నారు. కాగా, రేపు (ఆదివారం) మహారాష్ట్రలో కాంగ్రెస్ తమ అభ్యర్థుల పేర్లను ప్రకటించే అవకాశం కూడా ఉంది.