హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు సంధించారు. పది నెలల్లో 25 సార్లు, 50 రోజులు ఢిల్లీకి పోయివస్తివి అంటూ ధ్వజమెత్తారు. పోను 25 సార్లు, రాను 25 సార్లు.. నీ ఢిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేసి సిల్వర్‌జూబ్లీ కూడా చేస్తివని ఎద్దేవా చేశారు. తట్టా మట్టి తీసింది లేదు, కొత్తగా చేసింది అసలే లేదంటూ విమర్శించారు. అన్నదాతలు అరిగోసలు పడుతున్నారని, గురుకులాలు గాల్లో దీపాల్లా మారాయని, వైద్యం కుంటుపడిందని, విద్యావ్యవస్థ గాడి తప్పిందన్నారు.
మూసి, హైడ్రా పేరుతో పేదోళ్ల పొట్టలు కొట్టారని, 420 హామీలను మడతపెట్టి మూలకు వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పండగలు పండగళ్లా లేవని, ఆడబిడ్డలకు చీరలు అందనేలేవని, అవ్వాతాతలు అనుకున్న పింఛను, తులం బంగారం జాడే లేదని ఫైరయ్యారు. స్కూటీలు, కుట్టు మిషిన్లు లేనేలేవని, అయినా ఢిల్లీకి పోయిరావాల్సిందేనంటూ ఎద్దేవా చేశారు.