ఈరోజు తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే రుణమాఫీ కూడా ఒకటి. ఎన్నో ఏళ్లుగా రైతులు రుణమాఫీ కోసం ఎదురుచూస్తున్నారు. గత ప్రభుత్వం రుణమాఫీ చేస్తామని చెప్పి మాట తప్పడం తో..కాంగ్రెస్ పార్టీ ఆ మాట నిలబెట్టుకుంటుందనే నమ్మకంతో రైతులు కాంగ్రెస్ కు జై కొట్టారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆగస్టు 15 లోగా రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి మాట ఇచ్చింది. కానీ రుణమాఫీ మాత్రం పూర్తి స్థాయిలో చేయలేకపోయింది. కేవలం 25% మందికి మాత్రమే చేసి..మిగతా వారికీ చేయలేదు. దీంతో రుణమాఫీ జరగని రైతులంతా ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
దీంతో మంత్రులు ఎప్పటికప్పుడు రుణమాఫీ తప్పకుండ చేస్తామని మాట ఇస్తూ వస్తున్నారు. తాజాగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందిస్తూ..డిసెంబర్ 9 లోగా ప్రతి రైతుకు రుణమాఫీ పూర్తి చేసి.. ఆ తర్వాత రైతు భరోసా రూ.7500 రైతుల అకౌంట్లోకి జమ చేస్తామన్నారు. హాలియా మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం సందర్భంగా.. బుధవారం లక్ష్మీనరసింహ గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పుట్టినరోజు డిసెంబర్ 9 నాటికి రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ రుణమాఫీ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో సన్నాలకు రూ.500 బోనస్ అందజేస్తామని తెలిపారు. నల్లగొండ జిల్లాలో రైతులు పామాయిల్ సాగు గణనీయంగా పెంచాలని, రైతుల సౌకర్యార్థం పామాయిల్ ఉత్పత్తి కేంద్రాన్ని నల్లగొండ జిల్లాలో సైతం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. రైతులకు కనీస సౌకర్యాలు అందించేందుకు మార్కెట్ యార్డులు కృషి చేయాలని కోరారు.