గ్రూప్‌ 1 అభ్యర్థుల కోసం రంగంలోకి దిగుతున్న కేటీఆర్

ktr comments on telangana government

తమ ఉద్యోగాల విషయంలో తమకు మద్దతు తెలపాలని గ్రూప్‌ 1 అభ్యర్థులు కోరగా..వస్తున్న మీకోసం అంటూ కేటీఆర్ సమాధానం ఇచ్చారు. ఈ మేరకు ‘ఎక్స్‌’లో అభ్యర్థుల విజ్ఞప్తికి స్పందించి రిప్లయ్‌ ఇచ్చారు. గ్రూప్‌ 1 పరీక్ష వాయిదా వేయాలని కోరుతూ అర్ధరాత్రి హైదరాబాద్‌లోని అశోక్‌ నగర్‌ చౌరస్తాలో అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళన చేపట్టడంతో పోలీసులు అత్యంత కర్కశంగా అరెస్ట్‌ చేశారు.

ట్విట్టర్ వేదికగా గ్రూప్స్ అభ్యర్థులు అనే ఎక్స్‌ అకౌంట్‌ నుంచి కేటీఆర్‌కు ఓ సందేశం పంపారు. ‘మమ్మల్ని క్షమించాలి. మీరు అశోక్ నగర్ రావాలి, మాకు మీ మద్దతు అవసరం ఉంది. అన్ని వ్యవస్థలు మాకు అన్యాయం చేస్తున్నాయి. మీ మద్దతు ఉంటే మాకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉంది. గ్రూప్ 1 అభ్యర్థులంతా ఏకతాటిపైకి వచ్చి మీకు సర్వదా రుణపడి ఉంటాం’ అంటూ గ్రూప్‌ 1 అభ్యర్థులు ట్వీట్ చేశారు.

ఈ ట్వీట్‌కి కేటీఆర్‌ స్పందించారు. ‘రేపు మిమ్మల్ని కలుస్తాను. అశోక్ నగర్ వేదికగా అయినా.. లేదా తెలంగాణ భవన్‌లో అయినా సరే మిమ్మల్ని కలుస్తా’ అంటూ కేటీఆర్ రిప్లయ్‌ ఇచ్చారు. ‘BRS మీ అందరికీ న్యాయం జరిగేలా చూస్తుంది’ అని భరోసా ఇచ్చారు. అది చెబుతూనే కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఘాటుగా విమర్శలు చేశారు. నేరుగా రాహుల్‌ గాంధీని ట్యాగ్‌ చేస్తూ కేటీఆర్‌ విమర్శించారు.

‘ఒక్క సంవత్సరంలోనే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పి రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాన్ని తెలంగాణ యువతకు తెలంగాణ సమాజానికి ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూనే ఉంటాం’ అని కేటీఆర్ అన్నారు. అయితే కేటీఆర్‌ను అభ్యర్థులు ఎక్కడ? ఎప్పుడు? కలుస్తారనేది మాత్రం ఉత్కంఠ ఏర్పడింది. పోలీసులు అభ్యర్థులను నిర్బంధిస్తారని.. ముందస్తు అరెస్ట్‌లు చేస్తారనే వార్తలు వస్తున్నాయి. మరి గురువారం ఏం జరుగుతుందనేది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *