కెప్టెన్సీ నుంచి హర్మన్ ప్రీత్ ఔట్..?

భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్సీ నుంచి హర్మన్ ప్రీత్ ను తప్పించాలని BCCI యోచిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో హెడ్ కోచ్ అమోల్ మజుందార్ తో బీసీసీఐ సమావేశం కానుందని, అప్పుడే కెప్టెన్సీపై ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. స్వదేశంలో జరిగే వన్డే WC 2025ను దృష్టిలో ఉంచుకుని జట్టుకు కొత్త కెప్టెన్ను నియమిస్తారని బోర్డు వర్గాలు పేర్కొన్నాయి.

1989 మార్చి 8న పంజాబ్‌లో జన్మించింది హర్మన్‌ప్రీత్‌. క్రికెట్‌లో తన పవర్‌ఫుల్‌ బ్యాటింగ్‌, కెప్టెన్సీతో గుర్తింపు పొందింది. 2022 బర్మింగ్‌హామ్‌లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో జట్టుకు రజత పతకం గెలవడం సహా అనేక విజయాలను అందించింది. క్రికెట్‌లో ఆమె ఎదుగుదల ఆమెను స్టార్‌గా మార్చడమే కాకుండా భారీగా అభిమానులను సంపాదించిపెట్టింది.

హర్మన్‌ప్రీత్ కౌర్ క్రికెట్ కెరీర్ 2009లో అంతర్జాతీయ అరంగేట్రం చేయడంతో ప్రారంభమైంది. అప్పటి నుంచి 130 వన్డేలు, 161 టీ20లు, 5 టెస్ట్ మ్యాచ్‌లు ఆడింది. వన్డేల్లో 3410 పరుగులు, టీ20ల్లో 3204 పరుగులు, టెస్టుల్లో 131 పరుగులు చేసింది. ఆస్ట్రేలియాతో జరిగిన 2017 మహిళల ప్రపంచ కప్ సెమీ-ఫైనల్‌లో కౌర్‌ అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడింది. ఆమె అజేయంగా 171 పరుగులు చేసి భారత్‌ను విజయపథంలో నడిపించింది.

కౌర్ బ్యాటర్‌గానే కాకుండా కెప్టెన్‌గానూ సేవలు అందిస్తోంది. ఆమె కెప్టెన్‌గా 2020 టీ20 ప్రపంచ కప్‌లో భారత్‌ను ఫైనల్‌కు తీసుకెళ్లింది. 2022లో కామన్వెల్త్ గేమ్స్‌లో రజత పతకాన్ని సాధించింది. ఆమె నాయకత్వానికి గుర్తుగా 2017లో అర్జున అవార్డు సహా అనేక ప్రతిష్ఠాత్మక అవార్డులు అందుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *