హైదరాబాద్: డీఎస్సీ ఉపాధ్యాయ పోస్టింగ్ కౌన్సెలింగ్ వాయిదా పడింది. మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా జరగాల్సిన కౌన్సెలింగ్ ప్రక్రియను సాంకేతిక కారణాలతో వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కొత్త కౌన్సెలింగ్ తేదీలను త్వరలో ప్రకటిస్తామని విద్యాశాఖ ప్రకటన విడుదల చేసింది. అయితే డీఎస్సీలో సెలెక్ట్ అయిన ఉపాధ్యాయుల కౌన్సెలింగ్‌కు సంబంధించి అన్ని జిల్లాల డాటా రాకపోవడంతోనే పోస్ట్‌పోన్ చేసినట్లు అధికారులు వెల్లడించారు.
డీఎస్సీ 2024 ద్వారా ఉపాధ్యాయ నియామక పత్రాలు అందుకున్న కొత్త టీచర్లకు మంగళవారం పోస్టింగ్‌లు ఇవ్వనున్నట్లు పాఠశాల విద్యాశాఖ అధికారులు ప్రకటించిన విషయం తెలిసిందే. నూతన టీచర్లు ఆయా డీఈఓలు సూచించిన కార్యాలయాల్లో జరిగే కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని సూచించారు. అయితే సాంకేతిక కారణాలతో కౌన్సెలింగ్ వాయిదా పడింది. కాగా, కౌన్సెలింగ్ బుధవారం ప్రారంభమయ్యే అవకాశం ఉన్నది. మెరిట్ సాధించిన అభ్యర్థులు తాము కోరుకున్న చోట కౌన్సెలింగ్ నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తున్నది.