ప్రముఖ వ్యాపారవేత్త, టాటా సన్స్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా (86) మరణించారు. అనారోగ్యంతో గత అర్ధరాత్రి ముంబైలోని బ్రీచ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. టాటా 1937 డిసెంబర్ 28న ముంబైలో నావల్ టాటా, సోనీ టాటా దంపతులకు జన్మించారు. హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నారు. రతన్ ఆజన్మాంతం బ్రహ్మచారిగానే ఉన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ పారిశ్రామికవేత్తల్లో రతన్ టాటా ఒకరు. 1991 నుంచి 2012 వరకు టాటా గ్రూప్ కు చైర్మన్ గా కొనసాగారు. ఆయన హయాంలో టాటా కంపెనీని ప్రపంచ వ్యాప్తంగా విస్తరింపజేశాడు. అంతేకాకుండా ప్రముఖ టెట్లీ, కోరస్, జాగ్వార్ ల్యాండ్ రోవర్ వంటి ప్రధాన కంపెనీలను సైతం కొనుగోలు చేసింది. ఇలా క్రమక్రమంగా టాటా దేశీయ సంస్థ నుంచి గ్లోబల్ పవర్ హౌస్ గా మారింది.
ప్రపంచంలోనే అత్యంత చవకైన కారు.. టాటా నానోను ఈయన హయాంలో ప్రవేశ పెట్టడం విశేషం. అదేవిధంగా దాని సాఫ్ట్ వేర్ సేవల విభాగం టాటా కన్సల్టెన్సీ -టీసీఎస్ ను ప్రపంచ ఐటీ అగ్రగామీగా విస్తరింపజేశారు. 2012లో చైర్మన్ పదవి నుంచి వైదొలిగారు. ఆ తరువాత టాటా సన్స్ మరియు టాటా మోటార్స్, టాటా స్టీల్ తో సహా ఇతర గ్రూప్ కంపెనీలకు చైర్మన్ ఎమెరిటస్ గా ఎంపికయ్యారు.1961లో టాటా స్టీల్లో ఉద్యోగంలో చేరారు. అంచెలంచెలుగా ఎదిగి 1991-2012 వరకు టాటా గ్రూప్ ఛైర్మన్ గా ఉన్నారు. తన నాయకత్వంలో టాటా గ్రూప్లో అనేక సంస్కరణలు చేపట్టారు. రతన్ టాటా మరణ వార్త యావత్ భారతీయులను కలిచివేస్తోంది. ‘నేషన్ ఫస్ట్’ అని నమ్మిన ఆయన, తన సంస్థనే కాకుండా పారిశ్రామిక రంగంలో దేశాన్ని ఉన్నత స్థానాలకు తీసుకెళ్లారని అంత గుర్తు చేసుకుంటున్నారు. రతన్ గొప్ప మానవతావాది అని ఆయన స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు అంటూ ప్రశంసిస్తున్నారు.