హైదరాబాద్: మంత్రి కొండా సురేఖ సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తుల గురించి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. అవి తాను అనుకోకుండా చేసిన వ్యాఖ్యలని, వాటిని ఉపసంహరించుకున్నట్లు సురేఖ చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. దీనిపై మీడియాతో చెప్పడంతో పాటు ఎక్స్ వేదికగా కూడా మంత్రి పోస్టు పెట్టారని తెలిపారు.
అందుకే సినీ ప్రముఖులు ఈ అంశానికి ముగింపు పలకాలని కోరారు. మహిళల పట్ల కేటీఆర్ చిన్నచూపు ధోరణిని ప్రశ్నించడం తప్పితే.. ఎవరి మనోభావాల్నీ దెబ్బతీయడం తన ఉద్దేశం కాదని సురేఖ పేర్కొన్నట్లు మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. ఇరువైపులా కూడా మహిళలు ఉన్న విషయాన్ని సినీ ప్రముఖులు గుర్తించాలని కోరారు.
“మంత్రి కొండా సురేఖపై కేటీఆర్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఓ సోదరికి ఓ సోదరుడిగా నూలుపోగు దండ వేసిన విధానాన్ని ట్రోల్ చేయడం జరిగింది. దీన్ని సినిమావాళ్లు కూడా చూసి ఉండొచ్చు. దీంతో ఆ మహిళ ఎంత బాధపడ్డారో ఆలోచించండి. బేషరతుగా సురేఖ తన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకున్నారు. ఇకపై కాంగ్రెస్ నేతలు, మంత్రులు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి” అని మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.