ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళాలో జరిగిన తొక్కిసలాట దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. అర్ధరాత్రి భక్తుల తాకిడికి భద్రతా ఏర్పాట్లు నిర్వీర్యం కావడంతో 20 మంది మృతి చెందారు. గాయపడిన భక్తులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. భక్తుల సంఖ్యకు అనుగుణంగా తగిన భద్రతా ఏర్పాట్లు లేకపోవడమే ఇటువంటి ఘటనలకు కారణంగా తెలుస్తోంది.
భారతదేశ చరిత్రలో ఇదే మొదటిసారి జరిగిన ప్రమాదం కాదు. స్వతంత్ర భారతదేశంలో 1954లో తొలిసారి నిర్వహించిన కుంభమేళాలో భారీ తొక్కిసలాట జరగడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఆ దుర్ఘటనలో 800 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత 1986లో హరిద్వార్‌లో 200 మంది, 2003లో నాసిక్‌లో 39 మంది, 2013లో అలహాబాద్‌లో 42 మంది మరణించారు.

కుంభమేళా ప్రపంచంలోనే అతి పెద్ద భక్తి మహోత్సవం. ప్రతి 12 ఏళ్లకోసారి జరిగే ఈ మహాసంభరానికి కోట్లు సంఖ్యలో భక్తులు తరలివస్తారు. మౌని అమావాస్య, పుష్య పౌర్ణమి, మహాశివరాత్రి రోజుల్లో భక్తుల సంఖ్య భారీగా పెరుగుతుంది. దీంతో భద్రతా ఏర్పాట్లు తగిన స్థాయిలో లేకపోతే ప్రమాదాలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రతి కుంభమేళాలో భక్తుల రద్దీ క్రమంగా పెరుగుతుండటంతో ప్రభుత్వాలు మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రత్యేకించి భద్రతా బారికేడ్లు, భక్తుల ప్రవాహ నియంత్రణ, సీసీ కెమెరాలు, అత్యవసర వైద్య సదుపాయాలు మరింత మెరుగుపరచాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని భద్రతా చర్యలను పునఃసమీక్షించాల్సిందిగా ఆదేశించింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని అధికారులకు సూచించింది. కుంభమేళా సందర్భంగా భక్తుల ప్రాణాలను కాపాడేందుకు మరింత ముందస్తు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలు కట్టుబడాలని ప్రజలు కోరుతున్నారు.