జబల్పూర్ జిల్లా సిహోరా వద్ద ఈ ఘటన
మధ్యప్రదేశ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడు మంది తెలుగు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. మహాకుంభమేళా ముగించుకొని తిరిగొస్తుండగా, జబల్పూర్ జిల్లా సిహోరా వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. భక్తులు ప్రయాణిస్తున్న మినీ బస్సును ఎదురుగా వస్తున్న ట్రక్కు ఢీకొట్టడంతో ఈ విషాదం జరిగింది. మృతి చెందిన వారిని హైదరాబాద్ నుంచి వచ్చిన వారిగా గుర్తించారు. వారు ప్రయాణించిన మినీ బస్సు (AP 29 W 1525) ను ఎదురుగా వచ్చిన ట్రక్కు వేగంగా వచ్చి బలంగా ఢీకొట్టింది. దీంతో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.

ప్రమాదంలో మరణించిన వారంతా హైదరాబాద్ నాచారం ప్రాంతానికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. క్షతగాత్రులను జబల్పూర్ సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించారు. ప్రస్తుతం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంతో బాధితుల కుటుంబాలు కన్నీరుమున్నీరుగా మారాయి. కుటుంబ సభ్యులు తమ బంధువులను కోల్పోయిన బాధను తట్టుకోలేకపోతున్నారు. ఈ ప్రమాద వార్త తెలిసిన వెంటనే బంధువులు హైదరాబాద్ నుంచి మధ్యప్రదేశ్ బయలుదేరారు. ప్రభుత్వం కూడా బాధిత కుటుంబాలకు అన్ని విధాలా సహాయం అందిస్తామని హామీ ఇచ్చింది. ట్రక్కు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు
పోలీసులు ప్రాథమిక అంచనా వేస్తున్నారు.