కర్ణాటక రాజకీయాల్లో హనీట్రాప్ భయాందోళన గురిచేస్తోంది. అందాన్ని ఎరగా వేసి ప్రజాప్రతినిధులను, అధికారులను బ్లాక్‌మెయిల్ చేయడం హనీట్రాప్‌లో భాగం. తాజాగా, 48 మంది ఎమ్మెల్యేలు హనీట్రాప్‌కు గురైనట్టు ఓ మంత్రి అసెంబ్లీలో ప్రకటించడంతో రాజకీయ వర్గాల్లో పెను దుమారం రేగింది.
హనీట్రాప్
పీడబ్ల్యూడీ మంత్రి సతీష్ జార్కిహొళి 48 మంది ఎమ్మెల్యేలు ఈ వలపు వలకు చిక్కినట్టు,ఇటీవల ఇద్దరు మంత్రులపై హనీ ట్రాప్ ప్రయత్నాలు జరిగాయని,సీడీలు, పెన్‌డ్రైవ్‌లలో వారి అభ్యంతరకర వీడియోలు, సంభాషణలు ఉన్నాయని బాధితుల్లో అధికారపక్షం సహా విపక్షసభ్యులు ఉన్నారని ఆయన పేర్కొన్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు అత్యంత సన్నిహితుడు, సహకార శాఖ మంత్రి కేఎన్ రాజన్నపై కూడా రెండు సార్లు హనీట్రాప్ జరిగిందని, దీనిపై హోంశాఖ దర్యాప్తు ప్రారంభించిందని పేర్కొన్నారు. గత 20 ఏళ్లుగా నాయకుల్ని వలపు వలలో దించడం పరిపాటిగా మారిందన్నారు ఈ తరహా రాజకీయాలు సరికాదని, కొందరు తమ రాజకీయ ప్రయోజనాల కోసం హనీట్రాప్ చేయిస్తున్నారని ఆరోపించారు. గతంలో తనపై కూడా రెండుసార్లు హనీట్రాప్‌కి ప్రయత్నించినా,అవి బెడిసికొట్టాయని పేర్కొన్నారు. ఇది ఇంతటితో ఆగిపోవాలని మంత్రి జార్ఖిహోళి అభిప్రాయపడ్డారు.
కేఎన్ రాజన్న
తుమకూరుకు చెందిన ఓ మంత్రి హనీట్రాప్ బాధితుడని చర్చ జరుగుతోంది.. ఆ జిల్లా నుంచి నేను, హోంమంత్రి పరమేశ్వర మంత్రులుగా ఉన్నాం,వలపు వలలో కనీసం 48 మంది ఎమ్మెల్యేలు చిక్కుకున్నారు,అయితే, ఇదేమీ కొత్త విషయం కాదు,బాధితుల్లో చాలామంది హైకోర్టులో స్టే తెచ్చుకున్నారు,ఇప్పుడు నా పేరు ప్రస్తావనకు వచ్చింది,దీనిపై ఫిర్యాదు చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని మంత్రి కేఎన్ రాజన్నచెప్పారు.

కర్ణాటక ప్రభుత్వం దర్యాప్తు
కర్ణాటకలో తీవ్ర దుమారం రేగుతోంది.ఇప్పటికే కర్ణాటక ప్రభుత్వం దర్యాప్తు ప్రారంభించింది. హోం మంత్రి పరమేశ్వర స్పందిస్తూ,ఉన్నతస్థాయి దర్యాప్తు చేపట్టనున్నట్టు ప్రకటించారు. ఎంతో పవిత్రమైన శాసనసభలో సభ్యులు గౌరవప్రదంగా మెలిగే అవకాశం కల్పించాలని ఆయన అన్నారు. ఇలాంటి వదంతులకు ముగింపు పలకాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. తుమకూరు ఎమ్మెల్సీ రాజేంద్ర సైతం తనపై కూడా హనీట్రాప్ జరిగినట్లు ఆరోపించారు.ముఖ్యమంత్రికి దీనిపై ఫిర్యాదు చేయనున్నట్లు ప్రకటించారు.
సీబీఐ విచారణ
సీబీఐ విచారణకు బీజేపీ డిమాండ్ చేస్తోంది. అత్యంత సీనియర్, ప్రముఖ నేతల్లో ఒకరైన సతీశ్ జార్ఖిహోళి హనీట్రాప్ గురించి ప్రకటన చేయడం చిన్న విషయం కాదని, ఇది నిజమై ఉంటుందని బీజేపీ నేత సీటీ రవి వ్యాఖ్యానించారు.హనీట్రాప్ అనేది మొదట ఆకర్షణ, ఆ తర్వాత బ్లాక్‌మెయిల్ పద్ధతిని అనుసరించే మోసపూరిత వ్యవస్థ.మహిళల లేదా పురుషుల ఫేక్ ప్రొఫైల్‌ను ఉపయోగించి వారితో మిత్రత్వం పెంచుకొని, ఆ తర్వాత గోప్యతకు సంబంధించిన వీడియోలు, సమాచారాన్ని సేకరించి వారిని బెదిరించడం జరుగుతుంది.హనీట్రాప్ గ్యాంగ్‌లు చాలా సందర్భాల్లో అధికారుల నుంచి రహస్య సమాచారాన్ని లాగేందుకు లేదా వారి నుంచి డబ్బు, ఇతర లాభాలను పొందేందుకు ఈ మార్గాన్ని ఉపయోగిస్తారు.