Ayodhya: ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో రామాలయం చుట్టూ రక్షణగా 4 కిలోమీటర్ల ప్రహరీ గోడను నిర్మించాలని నిర్ణయించారు. ఇది 18 నెలల్లో పూర్తవుతుందని భావిస్తున్నారు. శ్రీరామ జన్మభూమి ఆలయ నిర్మాణ కమిటీ ఛైర్‌పర్సన్ నృపేంద్ర మిశ్ర సోమవారం ఈ విషయం వెల్లడించారు. గోడను ఇంజనీర్స్ ఇండియా సంస్థ నిర్మిస్తుందని, దాని ఎత్తు, మందం, డిజైన్ వంటి విషయాలను నిర్ణయించామని, మట్టి పరీక్షలు నిర్వహించాక పని ప్రారంభిస్తామని తెలిపారు. ఆలయ నిర్మాణ కమిటీ సమావేశం మూడోరోజు ఈ విషయం ప్రస్తావనకు వచ్చినట్లు చెప్పారు.

కొత్తగా చేసిన భద్రతా ఏర్పాట్లు
ఆలయ నిర్మాణంలో పురోగతి, కొత్తగా చేసిన భద్రతా ఏర్పాట్లు, విగ్రహాల ప్రతిష్ఠాపన, ఆలయ పరిసరాల్లో అభివృద్ధి వంటి విషయాలు సమావేశంలో చర్చకు వచ్చాయి. మందిర నిర్మాణం మరో ఆరు నెలల్లో అన్నివిధాలా పూర్తి కాబోతోందని మిశ్ర తెలిపారు. రామాలయ సముదాయంలోనే 10 ఎకరాల్లో ధ్యాన మందిరాన్ని నిర్మిస్తామని చెప్పారు. ప్రయాణికుల సౌకర్యం కోసం మరో పదెకరాల విస్తీర్ణంలో 62 స్టోరేజీ కౌంటర్లను, ఇతర సదుపాయాలను ఏర్పాటు చేయనున్నామన్నారు. సప్త మండల ఆలయాలకు సంబంధించిన విగ్రహాలన్నీ జైపుర్ నుంచి ఆయా ఆలయాలకు చేరుకున్నాయని వెల్లడించారు.
ఆదివారం రాత్రి బెదిరింపు ఈ-మెయిల్
కాగా, అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అధికారిక మెయిల్ ఐడీకి ఆదివారం రాత్రి బెదిరింపు ఈ-మెయిల్ రావడం కలకలం రేపింది. భద్రతను మరింత పెంచారు. దీనిపై ఆలయ అధికారులు, పోలీసులు ఎలాంటి ప్రకటన చేయలేదు. రామాలయంలోని గర్భగుడి ప్రధాన శిఖరంపై భారీ కలశాన్ని సోమవారం ప్రతిష్ఠించారు. ‘కలశ పూజా విధి’ నిర్వహించారు. ఆలయ సముదాయంలో నిర్మిస్తున్న 6 దేవాలయాల పైభాగంలో కూడా కలశాలను మరికొద్ది రోజుల్లో ఏర్పాటు చేయనున్నారు. అందుకోసం ఆలయ నిర్మాణ కార్మికులు రాత్రింబవళ్లు పని చేస్తున్నారు.