అమరావతి: సాంకేతిక విశ్వవిద్యాలయాల్లో విద్యార్థుల సంఖ్య, ఉద్యోగుల వివరాలు, ఖాళీల భర్తీ, యూనివర్సిటీల అభివృద్ధిపై మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సమాధానం ఇచ్చారు. మంత్రి మాట్లాడుతూ..ఏపీలో ఉన్న యూనివర్సిటీల్లో ఖాళీలన్నీ ఈ ఏడాదిలోనే భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. వన్ మ్యాన్ కమిషన్ రిపోర్ట్ వచ్చిన వెంటనే ఆ ప్రక్రియ కూడా ప్రారంభిస్తాం అన్నారు. విశ్వవిద్యాలయాల్లో 4,330 శాంక్షన్ పోస్టులు ఉంటే కేవలం 1,048 పోస్టులు భర్తీ చేశారు. 3,282 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిని భర్తీ చేస్తాం అన్నారు.

ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ లో మనం 9వ స్థానం
ఏపీలో జీఆర్(గ్రాస్ ఎన్ రోల్ మెంట్) రేషియో 36.5 శాతం, ఢిల్లీ 49 శాతం, తమిళనాడులో 47శాతంగా ఉంది. రాష్ట్రంలో చిత్తూరు, గుంటూరులో 45శాతం కంటే ఎక్కువగా ఉందన్నారు. అనంతపూర్, కర్నూలు, శ్రీకాకుళంలో 30 నుంచి 35 శాతం మధ్య ఉంది. మహిళల విషయానికి స్టెమ్ కోర్సుల్లో తక్కువగా ఉన్నారని తెలిపారు. రాష్ట్రంలో కేవలం 1,400 మాత్రమే పేటెంట్ ఫైలింగ్స్ జరిగాయన్నారు. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ లో మనం 9వ స్థానంలో ఉన్నామని వెల్లడించారు.
వివాదాలకు తావులేకుండా పకడ్బందీ నోటిఫికేషన్
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లీప్(లెర్నింగ్ ఎక్స్ లెన్స్ ఇన్ ఏపీ) పేరుతో సెక్టర్స్ స్పెసిఫిక్ ఇన్ స్టిట్యూషన్స్ పై దృష్టి పెట్టి కాలేజీలు, పాలిటెక్నిక్ లు, ఐటీఐ, యూనివర్సిటీలతో క్లస్టరింగ్ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఏయూలో సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ఏర్పాటు చేయాలని ఎన్వీడియాను కోరాం అన్నారు. స్టార్టప్ ఇంక్యుబేషన్ బలోపేతం చేస్తాన్నారు. బడ్జెట్ లో కూడా ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను బలోపేతం చేసేందుకు రూ.2వేల కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. డీఎస్సీ విషయంలో గతంలో జరిగిన తప్పులను స్టడీ చేసి న్యాయపరమైన వివాదాలకు తావులేకుండా పకడ్బందీ నోటిఫికేషన్ ఇవ్వాలనే లక్ష్యంతో పనిచేస్తామన్నారు.