2024 ముగింపు దశలోకి వచ్చిన నేపథ్యంలో,ప్రేక్షకుల దృష్టి మొత్తం 2025లో రాబోయే బిగ్ రిలీజ్‌లపై పడింది. సంక్రాంతి రిలీజ్ డేట్లు ఇప్పటికే ఖరారవ్వగా,సమ్మర్ 2025 కూడా భారీ పోటీతో ఆకర్షణీయంగా మారుతోంది.ఒక్కొక్కరు తమ తమ ప్రాజెక్ట్‌లను ప్రకటిస్తుండటంతో ఈసారి సమ్మర్ సీజన్ సినీ ప్రియులకు నిజమైన పండగలా మారనుంది.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల కోసం భారీ ప్రాజెక్ట్ హరి హర వీరమల్లు మార్చి 28న థియేటర్లలో సందడి చేయనుంది. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పీరియడ్ డ్రామాలో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది.ఈ చిత్రాన్ని విజువల్ గ్రాండియర్‌తో తీర్చిదిద్దుతున్న మేకర్స్ అభిమానులను ఆకట్టుకునేందుకు సిద్ధమయ్యారు.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఈసారి దర్శకుడు మారుతితో కలిసి రొమాంటిక్ హారర్ కామెడీ రాజా సాబ్ లో నటిస్తున్నారు.ఈ చిత్రం ఏప్రిల్ 10న విడుదల కానుంది.మాళవిక మోహనన్, నిధి అగర్వాల్,రిద్ధి కుమార్ లాంటి గ్లామరస్ హీరోయిన్స్‌తో ఈ చిత్రం ఇప్పటికే హైప్ తెచ్చుకుంది.విభిన్నమైన కథతో ప్రభాస్ మరోసారి తన అభిమానులను అలరించనున్నారు.

అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న యాక్షన్ డ్రామా ఘూటి కూడా ఏప్రిల్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది.క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం హై అక్టేన్ ఎంటర్‌టైనర్‌గా ఉన్నట్లు సమాచారం.అనుష్కను మళ్లీ పవర్‌ఫుల్ రోల్‌లో చూడాలని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

సమకాలీన సైన్స్ ఫిక్షన్ కథతో తేజ సజ్జ నటిస్తున్న మిరాయ్ కూడా ఏప్రిల్ 18న విడుదల కానుంది.కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో రితిక నాయక్ కథానాయికగా కనిపించనుంది.మంచు మనోజ్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా తన విభిన్న కథా నేపథ్యంతో ఇప్పటికే అందరిలో ఆసక్తి రేకెత్తించింది.సంక్రాంతి రేస్ నుంచి తప్పుకున్న మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర తో సమ్మర్ బరిలోకి దిగనున్నారు.