ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మత్సకారులకు వేసవిలో ఆర్థిక భారం లేకుండా చేయాలన్న ఉద్దేశంతో రూ.20 వేలు చొప్పున పరిహారం ఇవ్వాలని నిర్ణయించింది. అమరావతిలోని వెలగపూడి సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా చేపల వేటపై వేసవిలో అమలవుతున్న నిషేధం నేపథ్యంలో మత్సకారులు ఉపాధి కోల్పోతారు కాబట్టి, వారిని ఆదుకునేందుకు ప్రతి ఏడాదిలా ఈసారి కూడా ప్రభుత్వం ముందుకొచ్చింది.
అర్ధరాత్రి నుంచి చేపల వేటపై నిషేధం
తూర్పు తీర ప్రాంతంలో నిన్న అర్ధరాత్రి నుంచి చేపల వేటపై నిషేధం ప్రారంభమైంది. ఇది 61 రోజులు అంటే జూన్ 15 వరకు కొనసాగనుంది. ఈ సమయంలో మత్సకారులు మరబోట్లు, ఇంజిన్ బోట్లతో సముద్రంలోకి వెళ్లవద్దని మత్స్యశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించినట్లయితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వారు పేర్కొన్నారు. ఈ నిషేధ సమయంలో ఉపాధి లేకుండా పోయే మత్సకారులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరికి రూ.20 వేల చొప్పున నష్టపరిహారం అందించనుంది.

ఈ పథకం ద్వారా ప్రభుత్వానికి ప్రజల్లో ఆదరణ
ఈ నెల 26న ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ఒక మత్సకార గ్రామాన్ని సందర్శించి వారికి ఈ పరిహారాన్ని అందించనున్నారని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఈ నిర్ణయం మత్సకార కుటుంబాలకు కొంత ఊరటను తీసుకొస్తుందని అంచనా. అలాగే, ఈ పథకం ద్వారా ప్రభుత్వానికి ప్రజల్లో ఆదరణ పెరుగుతుందని భావిస్తున్నారు.