తెలుగు సినీ నటుడు పోసాని కృష్ణమురళికి ఆంధ్రప్రదేశ్‌లోని రైల్వే కోడూరు కోర్టు 14 రోజుల న్యాయ రిమాండ్ విధించింది. కేసు విచారణలో భాగంగా నిన్న 9 గంటలపాటు పోలీసుల విచారణ ఎదుర్కొన్న ఆయనను, రాత్రి కోర్టు ముందు హాజరుపర్చారు. కోర్టు తీర్పుతో ఆయనను కడప సెంట్రల్ జైలుకు తరలించే అవకాశం ఉంది. పోసాని నేరం చేయలేదని, బెయిల్ మంజూరు చేయాలంటూ ఆయన తరఫున వాదనలు వినిపించిన అడ్వొకేట్ పొన్నవోలు సుధాకర్ చేసిన విజ్ఞప్తిని న్యాయమూర్తి తిరస్కరించారు.

పోసానికి 14 రోజుల రిమాండ్
నిన్న రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కోర్టులో వాదనలు కొనసాగాయి. ప్రాసిక్యూషన్ తరఫున గట్టిగా వాదనలు వినిపించడంతో, చివరికి న్యాయమూర్తి పోసానికి 14 రోజుల రిమాండ్ విధించారు. విచారణ సందర్భంగా, పోలీసులు పోసాని వ్యవహారంపై మరిన్ని ఆధారాలను కోర్టుకు సమర్పించినట్లు తెలుస్తోంది. ఈ కేసు గత కొంతకాలంగా రాజకీయంగా కూడా చర్చనీయాంశంగా మారింది.
సినీ పరిశ్రమ, రాజకీయ వర్గాల్లో సంచలనం
పోసాని కేసు నేపథ్యంలో సినీ పరిశ్రమ, రాజకీయ వర్గాల్లో సంచలనం రేపింది. ఆయనపై ఉన్న ఆరోపణలు, కోర్టు తీర్పు, తదుపరి చట్టపరమైన పరిణామాలు గురించి అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అభిమానులు, ఆయన మద్దతుదారులు ఈ కేసులో న్యాయం జరిగేలా చూడాలని కోరుతున్నారు. ఇకపోతే, పోసాని తరఫున లాయర్లు మరోసారి బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉందని సమాచారం.