వృద్ధాప్యం అనగానే చాలామంది విశ్రాంతిని కోరుకుంటారు.కానీ తమిళనాడులోని ఓ వృద్ధుడు మాత్రం అందుకు భిన్నంగా, నిజమైన జీవిత స్ఫూర్తిగా నిలుస్తున్నారు.ఆయన వయసు 120 ఏళ్లు.అయినా ఇంకా తన పాదాలపై నిలబడి కష్టపడుతూ జీవనం సాగిస్తున్నారు. ఇది నేడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ మహానుభావుడి పేరు మహ్మద్ అబు సలీమ్.వయస్సు నమ్మశక్యంగా లేకపోయినా, ఆయన జీవన విధానం చూసి యువత కూడా ఆశ్చర్యపడుతున్నారు.బర్మాలో పుట్టిన సలీమ్ గారు, కొన్ని దశాబ్దాల క్రితం తమిళనాడుకు వలస వచ్చారు.అక్కడే స్థిరపడ్డారు.అయితే జీవితంలో ఓ ఘోరమైన దుర్ఘటన ఆయనను వేదించింది. ఒకటి కాదు, రెండు కాదు—తన కుటుంబ సభ్యులందరినీ ఓ ప్రమాదంలో కోల్పోయారు.ఆ విషాదాన్ని తట్టుకుని, చేతిలో ఏం లేకపోయినా, ఒక ఆశతో ముందుకు సాగారు.తాను తెలిసిన శ్రమతోనే జీవించాలన్న సంకల్పంతో తీపి తినుబండారాల తయారీ చేపట్టారు. అలా మొదలైంది ఆయన లడ్డూ ప్రయాణం.
అల్లం, కొబ్బరి, గ్లూకోజ్‌తో ప్రత్యేకమైన రుచుల లడ్డూలు తయారు చేయడం ఆయన ప్రత్యేకత.50 ఏళ్లుగా అదే పనిలో ఉన్నారు.కడలూరు, విల్లుపురం, తిండివనం, మాయావరం, కుంభకోణం ఇలా ఎన్నో పట్టణాల్లో ఆయన లడ్డూలకు మంచి గుర్తింపు ఉంది.ఎక్కడికైనా వెళ్లి స్వయంగా అమ్మడం ఆయన అలవాటు. కానీ ఇప్పుడు వయస్సు అడ్డు కావడంతో ఇంటి వద్దే తయారీకి పరిమితం అయ్యారు. అయినా రుచి మర్చిపోలేని లడ్డూల కోసం ప్రజలు స్వయంగా ఆయన ఇంటి వద్దకు వస్తున్నారు.అందరి అబ్బురానికి కారణమైన విషయం ఏంటంటే – ఆయన రోజూ రెండు లేదా మూడు లడ్డూలు తింటారు. అయినా శరీరానికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు. ఇది ఆయన ఆరోగ్యానికి కూడా ఓ రహస్యం అయ్యింది.ఇటీవల మహ్మద్ షేక్ అనే యువకుడు సలీమ్ గారిని ఇంటర్వ్యూ చేశారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పంచుకోవడంతో ఒక్కసారిగా ఆయన కథ వైరల్ అయిపోయింది. వందలాది మంది నెటిజన్లు ఈ వృద్ధుడిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. వయసు నిమిత్తం కాదు, మనసు యువకుడివైతే ఏ పని సాధ్యమేనని చాటిచెప్పారని అందరూ అంటున్నారు.ఇతరులు విశ్రాంతికి మొగ్గుచూపే వయసులో, సలీమ్ మాత్రం జీవనోపాధి కోసం కాకుండా, జీవితానికే ఓ ప్రేరణగా నిలిచారు. ఆయన పట్టుదల, శ్రమ, స్ఫూర్తి మనందరికీ ఒక గొప్ప బోధ. ఇది కేవలం ఓ వ్యక్తి జీవితం కాదుగాని, ఒక జీవన పాఠం. అలాంటి కథలు నేటి సమాజానికి నిజంగా అవసరం.
Read Also : Gaza: గాజాలో 51వేలకు చేరిన మృతుల సంఖ్య