పాకిస్తాన్‌పై ‘ఆపరేషన్ సింధూర్’ ఇప్పటికీ కొనసాగుతోందని, సరిహద్దు వద్ద పరిస్థితి వేగంగా మారుతోందని.. పొరుగు దేశంతో కొనసాగుతున్న వివాదం గురించి రాజకీయ పార్టీలకు కేంద్రం తెలిపింది. ఆపరేషన్ సింధూర్, (operation sindoor) భారత్ – పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తలపై ఢిల్లీలో గురువారం జరిగిన అఖిలపక్ష సమావేశం ముగిసింది. పార్లమెంట్ అనెక్స్ భవనంలో రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ నేతృత్వంలో ఈ అఖిలపక్ష సమావేశం జరిగింది.. ఆపరేషన్ సిందూర్ (operation sindoor) విజయాన్ని కేంద్ర ప్రభుత్వం అఖిలపక్షానికి వివరించింది. ప్రభుత్వం తరఫున అఖిలపక్ష సమావేశానికి రాజ్ నాథ్ సింగ్ తోపాటు అమిత్ షా, జేపీ నడ్డా, కిరణ్ రిజుజు హాజరయ్యారు. అఖిలపక్ష సమావేశంలో మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, లావు శ్రీకృష్ణ దేవరాయలు, మిథున్ రెడ్డి సహా వివిధ పార్టీల పార్లమెంటరీ పక్ష నేతలు హాజరయ్యారు. ఆపరేషన్ సిందూర్ సైనిక చర్య, తదుపరి పరిణామాలు, దేశ భద్రతా చర్యలను రక్షణ శాఖ మంత్రి రాజనాధ్ సింగ్ ప్రతిపక్షాలకు వివరించారు.
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో జరిగిన భద్రతా సమీక్ష
ఈ సందర్భంగా రాజనాధ్ సింగ్ మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్ (operation sindoor)లో పాకిస్తాన్, పీఓకేలో 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారని వెల్లడించారు. దేశ భద్రత విషయంలో ఎలాంటి చర్యలకైనా సిద్ధం అని స్పష్టంచేశారు.

బీఎస్ఎఫ్, ఆర్మీ అప్రమత్తంగా ఉన్నాయి
ఈ సమావేశంలో, పాకిస్తాన్‌పై ఆపరేషన్ సిందూర్ ఇంకా కొనసాగుతోందని, సరిహద్దులో పరిస్థితి ఇంకా అలానే ఉందని రక్షణ మంత్రి నాయకులకు తెలియజేసినట్లు వర్గాలు తెలిపాయి. మే 7న పీఓకే-పాకిస్తాన్‌లోని పంజాబ్‌లోని 21 లక్ష్యాలపై జరిగిన ఉగ్రవాద లాంచ్‌ప్యాడ్‌లపై సైనిక దాడుల్లో 100 మంది ఉగ్రవాదులు మరణించారని కూడా ఆయన చెప్పారు.
ఈ సమావేశానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షత వహించారని, ఆపరేషన్ సిందూర్ గురించి అందరికీ వివరించారని, అందరు నాయకులు తమ సూచనలను అందించారని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు (kiren rijiju) తెలిపారు.
“మనమందరం కలిసి పనిచేస్తున్న సమయంలో నాయకులందరూ పరిణతి ప్రదర్శించారు. ఆపరేషన్ సిందూర్ కోసం అందరూ సాయుధ దళాలను ప్రశంసించారు.. అభినందించారు .. మేము ప్రభుత్వానికి, సాయుధ దళాలకు మద్దతు ఇస్తామని చెప్పారు. మాకు కొన్ని సూచనలు కూడా వచ్చాయి… ” అని ఆయన అన్నారు.
మల్లికార్జున ఖర్గే ప్రకటన
భద్రతకు సంబంధించి ప్రభుత్వం చెప్పింది తాము విన్నామని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (mallikarjun kharge) తెలిపారు. దేశభద్రతకు సంబంధించి కొన్ని విషయాలు వెల్లడించలేమని రక్షణ మంత్రి తెలిపారని అన్నారు. ఆ విషయాన్ని తాము గౌరవించామని ఖర్గే వెల్లడించారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో మేము ప్రభుత్వం వెంట ఉన్నామని చెప్పామని.. తెలిపారు. అఖిల పక్షానికి ప్రధాని రాకపోవడంపై అసంతృప్తి వ్యక్తంచేసిన ఖర్గే.. ప్రస్తుత పరిస్థితుల్లో తాము ఎవరిని విమర్శించడం లేదన్నారు. రాహుల్ గాంధీ మాట్లాడుతూ ప్రభుత్వానికి అందరూ మద్దతు ప్రకటించారని తెలిపారు. పహల్గామ్ ఉగ్రదాడికి పాల్పడిన TRF సంస్థకు వ్యతిరేకంగా అంతర్జాతీయంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. అఖిలపక్ష సమావేశంలో తాను ప్రభుత్వానికి ఈ సూచన చేశానని అసద్ తెలిపారు.
Read Also: Operation Sindoor : ఆపరేషన్ సింధూర్ ముగియలేదు ..కేంద్రం ప్రకటన