చైనాలోని ఘాన్సూ ప్రావిన్స్ (China Provinces) భారీ వరదల కారణంగా అల్లకల్లోలంగా మారింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల ఈ ప్రాంతంలో ఆకస్మిక వరదలు సంభవించాయి. దీనివల్ల ఇప్పటివరకు 10 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 33 మంది గల్లంతయ్యారని అధికారులు తెలిపారు. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించడానికి, గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అధికారులకు అత్యవసర ఆదేశాలు
ఈ ఘోర విపత్తుపై స్పందించిన చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ అధికారులకు అత్యవసర ఆదేశాలు జారీ చేశారు. వరదల్లో చిక్కుకున్న ప్రజలను తక్షణమే రక్షించాలని, ముంపు ప్రాంతాల్లో నివసిస్తున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆయన సూచించారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని, ప్రజలకు అవసరమైన అన్ని సహాయక చర్యలు అందించాలని ఆయన ఆదేశించారు. వరద బాధితులను ఆదుకోవడానికి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని జిన్ పింగ్ హామీ ఇచ్చారు.
ఇప్పటివరకు వరదల్లో 44 మంది మృతి
గత నెలలో బీజింగ్‌లో సంభవించిన వరదల్లో 44 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘోర విపత్తు మరువకముందే, ఘాన్సూ ప్రావిన్స్‌లో సంభవించిన వరదలు చైనా ప్రభుత్వాన్ని, ప్రజలను కలవరపెడుతున్నాయి. వాతావరణ మార్పుల కారణంగా ఇలాంటి విపత్తులు తరచుగా సంభవిస్తున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి ప్రకృతి విపత్తులను ఎదుర్కోవడానికి చైనా ప్రభుత్వం దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు.
Read Also : EC : ఈసీకి ప్రశ్నలు సంధించిన రాహుల్ గాంధీ