బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ ప్రస్తుతం ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకుంటున్నారు. శుక్రవారం నాటికి ఆయన ఆరోగ్యం మెరుగుపడటంతో ఆసుపత్రిలోని సాధారణ గదికి మారారు. సైఫ్ అలీ ఖాన్ నివసించే బాంద్రాలోని శరణ్ సత్గురు భవనంలో గురువారం తెల్లవారుజామున ఒక చొరబాటుదారుడు దాడి చేయడం కలకలం సృష్టించింది. నిందితుడు మెట్లు ఎక్కి 12వ అంతస్తులో ఉన్న సైఫ్ నివాసంలోకి ప్రవేశించాడు. ఈ దాడి సమయంలో నిందితుడు కత్తిని ఉపయోగించి సైఫ్ అలీ ఖాన్‌ను తీవ్రంగా గాయపరిచాడు.

సైఫ్ పై ఆరు కత్తిపోట్లు తగిలాయి. సైఫ్ వెన్నెముక మరియు మెడకు తీవ్ర గాయాలు అయ్యాయి, నటుడు ముంబైలోని లీలావతి ఆసుపత్రికి వచ్చినప్పుడు, అతని వెన్నెముకలో కత్తి దాడి వాళ్ళ అతని వెన్నెముకలోని ద్రవం లీక్ అయ్యింది అని వైద్యులు చెప్పారు. అనేక శస్త్రచికిత్సలు చేయించుకున్న నటుడు “ప్రమాదం నుండి బయటపడ్డాడు” అని ఆసుపత్రి అధికారులు తెలిపారు. లీలావతి ఆసుపత్రిలో ప్రస్తుతం సైఫ్ కోలుకుంటున్నారు.
సైఫ్ భార్య కరీనా కపూర్ శుక్రవారం పోలీసులకు తన వాంగ్మూలాన్ని నమోదు చేశారు. కరీనా వాంగ్మూలం ప్రకారం, చొరబాటుదారుడు చాలా దూకుడుగా ప్రవర్తించాడు. చొరబాటుదారుడు మొదట సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ దంపతుల చిన్న కుమారుడు జహంగీర్ (జెహ్) బెడ్‌రూమ్‌లో కనిపించాడు. ఆ సమయంలో ఇంటి సహాయకురాలు అలారం మోగించింది. దీంతో సైఫ్ వెంటనే జోక్యం చేసుకుని, మహిళలను రక్షించడానికి చర్యలు తీసుకున్నారు. అలాగే, దాడి చేసిన వ్యక్తి జహంగీర్ దగ్గరికి వెళ్లకుండా అడ్డుకున్నారని కరీనా పోలీసులకు వివరించారు. ఇంట్లో బహిరంగ ఉన్న ఆభరణాలను నిందితుడు తాకలేదని ఆమె స్పష్టం చేశారు. నిందితుడు సైఫ్ ఇంటి సహాయకుడిపై కూడా దాడి చేశాడు. దాడి జరిగినప్పుడు సైఫ్ అతన్ని ఆపేందుకు ప్రయత్నించడంతో ఈ ఘర్షణ చోటు చేసుకుంది.
సైఫ్ అలీ ఖాన్ జనవరి 21న ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కావచ్చని భావిస్తున్నారు. తన ఇంట్లో జరిగిన సంఘటన తర్వాత కరీనా తన సోదరి, నటి కరిష్మా కపూర్ ఇంటికి వెళ్లారు. ఈ సంఘటనపై 30కి పైగా పోలీసు బృందాలు దర్యాప్తు కొనసాగిస్తున్నాయి. అతను సంఘటన జరిగిన 48 గంటలకు పైగా పరారీలో ఉన్నాడు. సైఫ్ ను చికిత్స కోసం సమయానికి ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు, ముంబై పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.