దేవదత్ పడిక్కల్ భారత క్రికెట్లో తనదైన ముద్ర వేస్తున్న యువ బ్యాట్స్‌మన్. ఇప్పటికే టెస్టు మరియు టీ20 ఫార్మాట్లలో భారత్ తరఫున ఆడిన పడిక్కల్, వన్డే జట్టులో స్థానం కోసం ఎదురు చూస్తున్నాడు. ఇటీవల లిస్ట్-ఎ మ్యాచ్‌ల్లో నిలకడగా రాణిస్తున్న అతను, రాబోయే ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో అవకాశాన్ని అందుకునేందుకు ఆశగా ఎదురు చూస్తున్నాడు.విజయ్ హజారే ట్రోఫీలో పడిక్కల్ అద్భుత ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ అనంతరం కర్ణాటక జట్టులో చేరిన పడిక్కల్, క్వార్టర్ ఫైనల్ మరియు సెమీ-ఫైనల్ మ్యాచ్‌ల్లో ప్రభంజన ప్రదర్శన చేశాడు.

వడోదరతో జరిగిన క్వార్టర్ ఫైనల్లో 102 పరుగులు చేసి జట్టును గెలుపు దిశగా నడిపించాడు. సెమీ-ఫైనల్లోనూ 86 పరుగులతో చక్కటి ప్రదర్శన కనబర్చాడు. ఈ అద్భుత ప్రదర్శనలతో కర్ణాటకను ఫైనల్‌కు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు.వన్డే ఫార్మాట్లో పడిక్కల్ తన ప్రతిభను నిరూపించాడు. 2019లో లిస్ట్-ఎ క్రికెట్లో అరంగేట్రం చేసిన పడిక్కల్ 31 ఇన్నింగ్స్‌ల్లో 9 సెంచరీలు, 12 అర్ధ సెంచరీలు సాధించాడు. 82.52 సగటుతో 2063 పరుగులు చేసిన ఈ యువ బ్యాటర్, ప్రతి మ్యాచ్‌లో తన శ్రమను కనిపెట్టించాడు. గత ఐదేళ్లుగా వన్డే జట్టులో అవకాశం దక్కకపోవడం ఆశ్చర్యకరమే.
ఫస్ట్ క్లాస్ క్రికెట్లోనూ పడిక్కల్ తన ప్రతిభను చూపించాడు. 2018లో అరంగేట్రం చేసిన అతను 41 మ్యాచ్‌ల్లో 4664 పరుగులు సాధించాడు. ఈ ప్రయాణంలో 6 సెంచరీలు, 17 అర్ధ సెంచరీలు చేశాడు. 2021 విజయ్ హజారే ట్రోఫీలో వరుసగా 4 సెంచరీలు చేసిన ఈ యువ క్రికెటర్, తన ఫామ్‌తో వన్డే జట్టులో అవకాశాన్ని గెలుచుకునే ప్రయత్నంలో ఉన్నాడు.దేశవాళీ లీగ్‌లలో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్న పడిక్కల్, త్వరలో భారత వన్డే జట్టులో కనిపిస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు.