సీఎం రేవంత్‌తో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ వంటి ప్రముఖులు పాల్గొననున్నారు. అలాగే,టాలీవుడ్ నుంచి ఈ చర్చలకు నాయకత్వం వహిస్తున్నది తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు. ఆయనతో పాటు చిరంజీవి, వెంకటేష్ వంటి ప్రముఖ హీరోలు కూడా పాల్గొంటున్నారు. అలాగే, యువతరం హీరోలు నితిన్, కిరణ్ అబ్బవరం, వరుణ్ తేజ్ కూడా ఈ సమావేశానికి హాజరయ్యే అవకాశముంది.
తెలంగాణలో ఇటీవల సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన సినీ పరిశ్రమ, ప్రభుత్వ సంబంధాలను మరింత గడ్డు పరిస్థితుల్లోకి నెట్టింది. ఈ సంఘటన తర్వాత ప్రభుత్వం, టాలీవుడ్ మధ్య కొంత దూరం ఏర్పడింది. సీఎం రేవంత్ ప్రజల ప్రాణాలను దృష్టిలో ఉంచుకుని, సినిమా ఇండస్ట్రీకి ప్రత్యేక హక్కులపై కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. స్పెషల్ షోలు, టికెట్ ధరల పెంపుల వంటి అంశాలను తక్షణమే రద్దు చేస్తామని పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు.ఈ భేటీ నేపథ్యంలో సినీ ప్రముఖులు, ముఖ్యమంత్రితో సమగ్ర చర్చలు జరపనున్నారు. సినిమా రంగానికి సంబంధించిన వివిధ సమస్యలపై స్పష్టత రానుంది. ముఖ్యంగా, టికెట్ రేట్ల పెంపు, స్పెషల్ షోలు అనుమతిపై నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది.ఈ భేటీపై పలువురు ప్రముఖులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
సినీ నటి, బీజేపీ నేత విజయశాంతి ఈ సమావేశంపై స్పందిస్తూ, “తెలంగాణ సీఎం, మంత్రులతో సినిమా పరిశ్రమకు సంబంధించిన అన్ని సమస్యలపై సమగ్రమైన చర్చలు జరగాలి,” అని అన్నారు. విజయశాంతి తన వ్యాఖ్యల్లో చిన్న తరహా చిత్రాల విడుదలకు థియేటర్ల కేటాయింపు, సాంకేతిక నిపుణులు, చిన్న కళాకారుల భద్రత వంటి అంశాలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచించారు. అలాగే, టికెట్ ధరల నియంత్రణ, సంక్రాంతి స్పెషల్ షోల అనుమతులపై స్పష్టత అవసరమని పేర్కొన్నారు. ఈ సమావేశం తర్వాత తెలుగు సినిమా రంగానికి ప్రభుత్వ మద్దతు ఎలా ఉంటుందో స్పష్టత వస్తుంది.