జరగబోయే రంజీ ట్రోఫీ మ్యాచ్ కోసం ఢిల్లీ జట్టు ను ఖరారు చేశారు. ఈసారి జట్టులో ఒక గొప్ప మార్పు చోటు చేసుకుంది. 13 ఏళ్ల తర్వాత టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఢిల్లీ రంజీ జట్టులోకి తిరిగి వచ్చాడు.ఇదే సమయంలో, యువ ఆటగాడు ఆయుష్ బడోనీ జట్టు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.వికెట్ కీపర్ రిషబ్ పంత్ కూడా 8 ఏళ్ల విరామం తర్వాత రంజీ జట్టులోకి చేరాడు. బీసీసీఐ కఠిన నిబంధనల నేపథ్యంలో జాతీయ స్థాయిలో ఉన్న స్టార్ ఆటగాళ్లు ఇప్పుడు మళ్లీ దేశవాళీ క్రికెట్‌లోకి అడుగుపెడుతున్నారు.

విరాట్ కోహ్లీ ఢిల్లీ జట్టులో చోటు సంపాదించడం క్రికెట్ అభిమానులకు మరింత ఉత్సాహాన్ని కలిగిస్తోంది. అయితే, విరాట్ కోహ్లీ సౌరాష్ట్రతో జరగబోయే మ్యాచ్‌లో ఆడాలన్నది అనుమానాస్పదం.సిడ్నీ టెస్టులో మెడ గాయానికి చికిత్స తీసుకుంటున్న విరాట్ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. గాయానికి చికిత్సగా ఇంజెక్షన్లు కూడా తీసుకున్నాడు. ఈ కారణంగా అతను ఈ మ్యాచ్‌లో ఆడకపోవచ్చు.
అయినప్పటికీ, జట్టుతో కలిసి రాజ్‌కోట్‌కు ప్రయాణించనున్నాడు.మరోవైపు, రిషబ్ పంత్ మాత్రం ఈ మ్యాచ్ ఆడనున్నాడు.రంజీ ట్రోఫీలో రిషబ్ పంత్ ఆకట్టుకునే ప్రదర్శనను కొనసాగించాడు.అతను ఇప్పటి వరకు 17 మ్యాచ్‌లలో 58.12 సగటుతో 1395 పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలు, 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.అతని అత్యుత్తమ స్కోరు 308 పరుగులు. అలాగే విరాట్ కోహ్లీ 23 రంజీ ట్రోఫీ మ్యాచ్‌ల్లో 50.77 సగటుతో 1574 పరుగులు సాధించాడు.ఐదు సెంచరీలు చేసిన కోహ్లీ దేశవాళీ క్రికెట్‌లో తనదైన ముద్ర వేసాడు.ఈసారి జట్టును యువ కెప్టెన్ ఆయుష్ బడోనీ నడిపించనున్నాడు.జూనియర్ ఆటగాడు అయిన ఆయుష్ అనుభవజ్ఞులైన కోహ్లీ, పంత్‌లను నాయకత్వం వహించడం ప్రత్యేకత. ఢిల్లీ జట్టు ఈ సారి మంచి ప్రదర్శన కనబరిచే అవకాశాలు ఉన్నాయని అభిమానులు ఆశిస్తున్నారు. రంజీ ట్రోఫీలో ఈ కీలక మార్పులు ఢిల్లీ జట్టుకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయని భావిస్తున్నారు.