రంజీ టోర్నీ కోసం రోహిత్ శర్మ, పంత్ సిద్ధం దశాబ్దం తర్వాత హిట్‌మన్ మళ్లీ బరిలో న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లలో టీమిండియాకు ఎదురైన పరాజయాల తర్వాత బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. దేశవాళీ క్రికెట్‌ను బలోపేతం చేసేందుకు ఆటగాళ్లను రంజీ ట్రోఫీలో పాల్గొనాలని ఆదేశించింది.
ఈ నిర్ణయానికి అనుగుణంగా జనవరి 23న ప్రారంభమయ్యే రంజీ టోర్నీ రెండో రౌండ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సహా పలువురు స్టార్ ఆటగాళ్లు బరిలోకి దిగనున్నారు.దశాబ్దం తర్వాత రోహిత్ శర్మ రంజీ టోర్నీ ఆడేందుకు సిద్ధమయ్యాడు.2015లో చివరిసారి రంజీలో ముంబై జట్టుకు ప్రాతినిధ్యం వహించిన హిట్‌మన్, ఇప్పుడు మళ్లీ తన సొంత మైదానంలో తలపడనున్నాడు. జనవరి 23న ముంబై జట్టు జమ్మూ కాశ్మీర్ జట్టుతో పోటీపడనుంది.గతంలో రోహిత్ చివరి రంజీ మ్యాచ్ ముంబై వాంఖడే స్టేడియంలో ఉత్తరప్రదేశ్ జట్టుతో జరిగింది.

ఆ మ్యాచ్‌లో రోహిత్ నాలుగో నంబర్‌లో బ్యాటింగ్ చేసి అద్భుతంగా 113 పరుగులు చేశాడు. ఇప్పుడు మళ్లీ తన దేశవాళీ క్రికెట్ ప్రయాణాన్ని కొనసాగించాలని నిర్ణయించాడు.రోహిత్ మాత్రమే కాకుండా రిషబ్ పంత్ కూడా రంజీ టోర్నీ ద్వారా సుదీర్ఘ విరామానికి తెర దించబోతున్నాడు. 2017 తర్వాత తొలిసారి దేశవాళీ వేదికపైకి రాబోతున్న పంత్, ఈసారి ఢిల్లీ తరపున వైట్ జెర్సీ ధరిస్తాడు. ఫిట్‌నెస్ సాధించడానికి రంజీ టోర్నీ అనుకూలంగా ఉంటుంది అని భావిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నాడు.
మరోవైపు, రంజీ టోర్నీ రెండో అర్ధభాగంలో విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ పాల్గొనడం లేదు. మెడ నొప్పితో బాధపడుతున్న కోహ్లీ విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అలాగే, మోచేయి గాయంతో రాహుల్ కూడా ఈ సిరీస్‌కు దూరంగా ఉంటాడు.రంజీ టోర్నీ 2వ రౌండ్‌లో రోహిత్, పంత్ వంటి సీనియర్ ఆటగాళ్లు పాల్గొనడం దేశవాళీ క్రికెట్‌లో కొత్త ఉత్సాహాన్ని తీసుకొస్తుంది. క్రికెట్ అభిమానులు హిట్‌మన్ బ్యాటింగ్ మజాకేను మళ్లీ చూడటానికి ఆతృతగా ఎదురుచూస్తున్నారు.