సినిమా ఇండస్ట్రీలో మరో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. మాయదారి గుండెపోటు మరో యువ నటుడిని బలి తీసుకుంది. భవిష్యత్తులో ఎంతో వెలుగొందే అవకాశం ఉన్న భోజ్‌పురి నటుడు, నిర్మాత, రాజకీయ నాయకుడు సుదీప్ పాండే గుండెపోటుతో మృతి చెందాడు.ముంబైలో ఓ సినిమా షూటింగ్‌లో గుండెపోటుతో కుప్పకూలిన సుదీప్, ఆసుపత్రిలో చికిత్స పొందినా ఫలితం లేకపోయింది. ఈ వార్తను అతని సన్నిహితులు సోషల్ మీడియా ద్వారా ధృవీకరించారు.సుదీప్ పాండే జనవరి 5న తన పుట్టినరోజును జరుపుకున్నారు.అనంతరం తన తదుపరి సినిమా షూటింగ్ కోసం ముంబై వెళ్లారు.
జనవరి 15న షూటింగ్‌లో ఉన్నప్పుడు ఆకస్మికంగా గుండెపోటు వచ్చింది.సుదీప్ నటుడిగా మాత్రమే కాకుండా, అభిరుచిగల నిర్మాతగా, రాజకీయ నాయకుడిగా తనను నిరూపించుకున్నారు.ఎన్సీపీ పార్టీలో క్రియాశీలకంగా పనిచేసిన సుదీప్, సినిమాల్లోకి రాకముందు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేశారు.2007లో ‘భోజ్‌పురి భయ్యా’ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసిన సుదీప్, తక్కువ సమయంలోనే యాక్షన్ హీరోగా గుర్తింపు పొందారు. ‘ఖూనీ దంగల్’,మసీహా బాబు’, ‘హమర్ సంగీ బజరంగీ బాలి’, ‘హమర్ లాల్కర్’, ‘షరాబీ’, ‘ఖుర్బానీ’ వంటి సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు.
ఫిట్‌నెస్‌పై ప్రత్యేక శ్రద్ధ చూపిన సుదీప్, రోజూ జిమ్‌లో గంటల తరబడి వ్యాయామం చేసేవారు. హ్యాండ్సమ్ హంక్‌గా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది.అయితే, ఇంత ఫిట్‌గా ఉన్న సుదీప్‌కు గుండెపోటు రావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. సుదీప్ ఆర్థికంగా కూడా కష్టాల్లో ఉన్నారని, ‘విక్టర్’ అనే సినిమాను నిర్మించి అది ఫ్లాప్ కావడం వల్ల అప్పుల్లో కూరుకుపోయినట్లు సమాచారం. సుదీప్ పాండే ఆకస్మిక మరణం సినీ పరిశ్రమకు పెద్ద లోటుగా మిగిలింది.