మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ పదవిలో కొనసాగినంత కాలం ‘మౌనముని’, ‘మౌన ప్రధాని’ అంటూ మీడియా, ప్రతిపక్షాలు అనేవి. దేశ ఆర్థిక వ్యవస్థ సంస్కర్తగా ఆయనకు పేరు వుంది. వరుసగా రెండు పర్యాయాలు ప్రధానిగా చిరస్మరణీయ సేవలు అందించారు. అయితే, ఆయన పదవిలో కొనసాగినంత కాలం ‘మౌనముని’, ‘మౌన ప్రధాని’ అంటూ ప్రతిపక్షాలు విమర్శించేవి.
ఈ తరహా వ్యాఖ్యలను పట్టించుకోకుండా దేశాభివృద్ధిలో ఆయన తనదైన బలమైన ముద్ర వేశారు. ప్రధానిగా మొదటి పర్యాయంలోనే ఎన్నో కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. పదవి నుంచి దిగిపోయిన నాలుగేళ్ల తర్వాత 2018లో తొలిసారి మౌనముని విమర్శలపై స్పందించారు. ఆరు సంపుటాలుగా ఆయన రచించిన ‘ఛేంజింగ్ ఇండియా’ పుస్తకావిష్కరణలో మాట్లాడారు.
నేను మౌనిని కాను, మీడియాతో మాట్లాడాను
‘‘నన్ను మౌన ప్రధాని అన్నారు. వాస్తవాలు ఏమిటో ఈ పుస్తకాలు తెలియజేస్తాయని భావిస్తున్నాను. ప్రెస్‌తో మాట్లాడటానికి భయపడిన ప్రధానమంత్రిని కాదు. నేను క్రమం తప్పకుండా మీడియాతో మాట్లాడాను. నేను చేపట్టిన ప్రతి విదేశీ పర్యటన సమయంలో మీడియాతో మాట్లాడాను.
విదేశాల నుంచి తిరిగి వచ్చిన తర్వాత పెద్ద సంఖ్యలో ప్రెస్ కాన్ఫరెన్స్‌లలో పాల్గొన్నాను. వాటి ఫలితాలను కూడా పుస్తకంలో వివరించాను’’ అని మన్మోహన్ సింగ్ గట్టి సమాధానం ఇచ్చారు.
1991లో ఆర్థిక సంస్కరణల ద్వారా ప్రపంచ మార్కెట్‌లో భారత ఆర్థిక వ్యవస్థను ఒక భాగంగా మార్చివేశారు. దీంతో దేశం ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడి వృద్ధిబాట పట్టింది.
ప్రజల సందర్శనార్థం
ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న సాయంత్రం ఆయన కన్నుమూశారు. ఆయన పార్థివదేహాన్ని ప్రస్తుతం మోతీలాల్ నెహ్రూ మార్గ్ లోని నివాసం వద్ద ఉంచారు. రేపు ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ప్రజల సందర్శనార్థం ఆయన పార్థివదేహాన్ని ఉంచనున్నారు. అనంతరంశనివారం ఆయన అంత్యక్రియలు జరగనున్నట్టు సమాచారం.