ఈ నెల 31 నుంచి మూడు రోజుల పాటు, జనవరి 1, జనవరి 2 వరకు అరకు ఉత్సవాన్ని నిర్వహించేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక ప్రాంతాలకు నూతన శోభ కల్పించడంతో పాటు, దేశ, విదేశాల నుంచి వచ్చే పర్యాటకుల కోసం రాష్ట్ర పర్యాటక శాఖతో పాటు, స్థానిక జిల్లా అధికారులతో కలసి ఈ ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించేలా అన్ని చర్యలు చేపడుతున్నారు అల్లూరి జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్. ప్రస్తుతం చలి తీవ్రత అధికంగా ఉండటంతో పాటు, వాతావరణం కూడా సిమ్లా, ఊటీ ప్రాంతాలను సైతం తలపించే విధంగా మంచు కూడా అధికంగా ఉండటంతో ఇప్పటికే పర్యాటకులతో ఆయా ప్రాంతాలన్నీ రద్దీగా కనిపిస్తున్నాయి. అయితే ఈ మూడు రోజుల పాటు నిర్వహించనున్న ఉత్సవాలను విజయవంతం చేసేందుకు పర్యాటకులంతా జిల్లా అధికారులకు సహకరించాలని కోరారు.

మూడు రోజులపాటు పండగ
అరకు ఉత్సవ్ సందర్భంగా ఇప్పటికే అన్ని పర్యాటక ప్రాంతాలు సర్వాంగ సుందరంగా విద్యుత్ కాంతితో తీర్చిదిద్దారు. మూడు రోజులపాటు పండగ వాతావరణం ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ అరకు ఉత్సవ్ తో మరింత పర్యాటకులు పెరిగే అవకాశం ఉంది. మూడు రోజులు పాటు గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు తెలిపే కార్యక్రమాలు, అరకు థింసా డాన్స్, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. ముఖ్యంగా అరకు, బొర్రా గుహాలను ప్లాస్టిక్ ఫ్రీ డెస్టినేషన్ గా ప్రకటించారు. అందుకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.