మన్మోహన్ సింగ్ మృతితో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క.. మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి నివాళి అర్పించనున్నట్లు తెలుస్తోంది. దీనికోసం వాళ్లు శనివారం ఢిల్లీకి వెళ్లొచ్చని చెబుతున్నారు. పార్థివ దేహానికి నిర్వహించబోయే అంత్యక్రియలకు హాజరవుతారని సమాచారం.
మన్మోహన్ సింగ్ మృతి పట్ల ఏడు రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. ఈ ఏడు రోజుల పాటు అంటే ఆయన కన్నుమూసిన రోజైన 26 నుంచి జనవరి 1వ తేదీ వరకు అధికారికంగా ఎలాంటి ఉత్సవాలు, వేడుకలను నిర్వహించకూడదని నిర్ణయించింది. అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా జాతీయ పతాకాన్ని అవనతం చేసి ఉంచాలని సూచించింది.
ఆయన మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం తెలియజేశారు. గొప్ప ఆర్థికవేత్తలలో ఒకరిగా, సంస్కర్తగా.. అన్నింటి కంటే మించి మన కాలంలోని మానవతావాదిగా ఆయన సేవలు భవిష్యత్ తరాలకు ఆదర్శనీయం, ఆచరణీయమని అన్నారు. సద్గుణాలు, నిష్కళంకమైన పరిపాలనను సమగ్రంగా, సమర్థంగా మానవీయ కోణంలో దేశ ప్రజలకు అందించారని అన్నారు.