ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన దేశంగా పరిగణిస్తున్న అమెరికా అధ్యక్షుడి పదవీకాలం ఆ దేశ విధానాలను ప్రభావితం చేయడమే కాకుండా ప్రపంచ స్థాయిలో చాలా విస్తృతమైన ప్రభావాన్ని చూపుతుంది. ఇవి ఆర్థిక విధానాల నుంచి దౌత్యపరమైన నిర్ణయాల వరకు ఉంటాయి. నేడు డోనల్డ్ ట్రంప్ అమెరికా 47వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈసారి జేడీ వాన్స్ ఆయనతో పాటు ఉపాధ్యక్షుడిగా ఉండనున్నారు.
ట్రంప్ మొదటి టర్మ్‌తో పోలిస్తే రెండో టర్మ్ వచ్చేసరికి ప్రపంచం చాలా మారిపోయింది. ఆయనకు కొత్త సవాళ్లు పుట్టుకొచ్చాయి. అటువంటి పరిస్థితిలో ట్రంప్ హయాంలో ఎలాంటి మార్పులు జరగవచ్చు?
అమెరికాకు ఎగుమతి చేసే వస్తువులపై భారత్ మరింత పన్ను చెల్లించాల్సి ఉంటుందా? అమెరికా, చైనాల మధ్య సంబంధాలలో ఎలాంటి మార్పులు రావొచ్చు? ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం పశ్చిమాసియాలో ఎంతవరకు శాశ్వత శాంతిని తెస్తుంది? రష్యా-యుక్రెయిన్ యుద్ధం ముగిసే అవకాశం ఉందా? వాతావరణ మార్పులపై అమెరికా వైఖరి ఎలా ఉంటుంది?

భారత్‌పై సుంకాలు విధిస్తారా?
డోనల్డ్ ట్రంప్ ప్రభుత్వం “అమెరికా ఫస్ట్” విధానాన్ని నొక్కిచెప్పడంతో భారత్-అమెరికా వాణిజ్య సంబంధాలలో కొద్దిగా మార్పులు రావొచ్చు. ఈ పరిస్థితులను భారత్ దౌత్యపరంగా ఎలా ఎదుర్కొంటుందన్న ప్రశ్న తలెత్తుతోంది. అమెరికాతో సంబంధాల విషయంలో మోదీ ప్రభుత్వం ఈసారి ఎలాంటి వ్యూహాత్మక విధానాన్ని అవలంబిస్తుంది? అది భారత్‌కే కాకుండా అమెరికాకూ ఎలా ప్రయోజనకరంగా మారుతుందనేది చూడాలి.
దక్షిణాసియాలో భారత్, పాకిస్తాన్, అప్గానిస్తాన్, భూటాన్, నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్, మాల్దీవులు ఉన్నాయి. ఈ ప్రాంతంలో 194 కోట్ల మంది నివసిస్తున్నారని ప్రపంచ బ్యాంకు అంచనా. దక్షిణాసియాలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ భారత్. గత కొన్నేళ్లలో దక్షిణాసియాలో భారత్ తన స్థానాన్ని బలోపేతం చేసుకుంది. మరి, ట్రంప్ రెండవ టర్మ్‌లో భారత స్థానం అలాగే ఉంటుందా? వీటన్నిటికీ కాలమే సమాధానం చెప్పాలి.