ఈ ప్రపంచంలో భార్య, భర్తల బంధానికి ఎంతో ప్రత్యేకత ఉంది. భార్య భర్తల బంధం అనేది ఒక పవిత్రమైన సంబంధం, ఇది విశ్వాసం, ప్రేమ, పరస్పర గౌరవం, మరియు బాధ్యతల మీద ఆధారపడి ఉంటుంది. ఈ బంధం సామాన్యంగా రెండు వ్యక్తుల మధ్య జీవితాంతం ఉండే సంబంధం. తమ జీవిత ప్రయాణాన్ని పరస్పరం సపోర్ట్ చేస్తూ, ఆనందాన్ని పంచుకునే జీవితం. భర్త అడుగుజాడల్లో నడుస్తూ తన కష్టాలను తన కష్టాలుగా భావిస్తుంటుంది. కానీ ప్రస్తుతం సమాజంలో వివాహ బంధాల ఎలా ఉన్నాయో చూస్తూనే ఉన్నాం. భర్త , భార్య ఉండగానే అక్రమ సంబంధాలు పెట్టుకోవడం..అక్రమ సంబధం మోజులో పడి కుటుంబాన్ని నాశనం చేసుకోవడం , భార్య , భర్తను చంపుకోవడం వరకు వెళ్తున్నారు. ఇలాంటి ఈరోజుల్లో తన భర్తకు అవయవదానం చేసి గొప్ప ఇల్లాలు అనిపించుకుంది.
వివరాల్లోకి వెళ్తే..
ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం పెద్ద ఈర్లపూడికి చెందిన ధారావత్ శ్రీను ఖమ్మంలోని ఏపీజీవీబీ బ్యాంకు లో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆయన భార్య లావణ్య ఎల్ఎల్బీ చివరి సంవత్సరం చదువుతుండగా వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కొద్దీ నెలల క్రితం శ్రీను అనారోగ్యం బారిన పడడంతో ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకున్నాడు. కామెర్లు సోకగా కాలేయం సమస్య ఉందని డాక్టర్లు గుర్తించారు. దీనితో ఆ దంపతులు ఆందోళన చెందారు. పలు ఆసుపత్రులకు తిరిగి చికిత్స చేయించు కొన్నారు. లక్షలు ఖర్చు చేసి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్లో చికిత్స చేయించుకున్నా నయం కాలేదు. అంతేకాక వివిధ పరీక్షల అనంతరం కాలేయ మార్పిడి మాత్రమే శ్రీనును బతికిస్తుందని డాక్టర్లు తేల్చిచెప్పారు. దీంతో కాలేయదానం చేసే వారి కోసం ఆరా తీసి అనేక ప్రయత్నాలు చేశారు.
భర్తను బ్రతికించు కోవడానికి.. లావణ్యే ముందుకొచ్చింది. తన భర్తను కాపాడుకోవడానికి లివర్ ఇస్తానని చెప్పడంతో పరీక్షలు చేసిన డాక్టర్లు సరిపోతుందని నిర్ధారించారు. ఈ మేరకు లావణ్య లివర్ నుంచి 65శాతం మేర తీసిన సికింద్రాబాద్ లోని కిమ్స్ ఆస్పత్రి వైద్యులు సర్జరీ ద్వారా శ్రీనుకు అమర్చారు. సర్జరీ విజయవంతం అయ్యింది. ప్రస్తుతం దంపతు లిద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని, కోలుకుంటున్నారని బంధువులు తెలిపారు. సంతోషం, సుఖాల్లోనే కాదు.. కష్టాల్లో తోడుగా నిలిచి.. భర్తను కాపాడుకుంది. భార్య లావణ్య ను పలువురు అభినందిస్తున్నారు. ప్రస్తుతం వీరిద్దరికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా వైరల్ అవుతుంది. నెటిజన్లు వీరి దాంపత్య బంధాన్ని ప్రశంసిస్తున్నారు. ఏదేమైనా భార్య భర్తల బంధానికి ఉన్న గొప్ప తనాన్ని వీరిద్దరూ మరోసారి నిరూపించి చూపించారు.