యువ బ్రాహ్మణ దంపతులకు మధ్యప్రదేశ్ ప్రభుత్వ బోర్డు వినూత్న ఆఫర్ ఇచ్చింది. బ్రాహ్మణ యువ జంటలు నలుగురు పిల్లలను కంటే రూ.లక్ష బహుమతిగా ఇస్తామని ప్రకటించింది. మధ్యప్రదేశ్‌కు చెందిన పరుశురామ్ కళ్యాణ్ బోర్డు అధ్యక్షుడు పండిట్ విష్ణు రజోరియా ఈ ప్రకటన చేశారు. రాష్ట్ర క్యాబినెట్ హోదాలో ఉన్న ఆయన ఇలాంటి ప్రకటన చేయడం చర్చనీయాంశంగా మారింది.
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో జరిగిన బ్రాహ్మణ కమ్యూనిటీకి సంబంధించిన కార్యక్రమంలో రజోరియా మాట్లాడుతూ.. దేశంలో నాస్తికుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నదని అన్నారు. మనం కుటుంబాలపై దృష్టి సారించకపోవడమే ఇందుకు కారణమని అన్నారు. ‘నాకు యువత మీద చాలా ఆశలు ఉన్నాయి. వయసుపైడిన వారిపై పెద్దగా ఆశలు పెట్టుకోలేం. జాగ్రత్తగా వినండి. భవిష్యత్ తరాన్ని రక్షించాల్సిన బాధ్యత మీపైనే ఉంది. యువత జీవితంలో సెటిలై ఒక సంతానంతో సరిపెట్టుకుంటున్నారు. ఇది పెద్ద సమస్య అయిపోయింది. ప్రతి జంట నలుగురు పిల్లలను కనాలని నేను మిమ్ములను కోరుతున్నా’ అని రజోరియా సూచించారు.

నలుగురు పిల్లలను కంటే ఆ బ్రాహ్మణ జంటకు పరుశురామ్ కళ్యాణ్ బోర్డు రూ.లక్ష బహుమతి ఇస్తుందని రజోరియా చెప్పారు. బోర్డు అధ్యక్షుడిగా తాను ఉన్నా లేకున్నా ఈ నగదు పురస్కారం ఇవ్వబడుతుందని అన్నారు.
అనంతరం రజోరియా ఓ జాతీయ ఛానెల్‌తో మాట్లాడుతూ.. ఈ ప్రకటన పూర్తిగా తన వ్యక్తిగతమని, ఈ ప్రకటనతో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని అన్నారు. బ్రాహ్మణ కులానికి సంబంధించిన కార్యక్రమంలో తాను ఈ ప్రకటన చేశానని చెప్పారు. పిల్లలను చదివించడం, ఉన్నత స్థానాలకు చేర్చడం బ్రాహ్మణ సమాజానికి పెద్ద కష్టమేమీ కాదని అన్నారు.