దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న ప్రతికూల పరిస్ధితుల నేపథ్యంలో రైతులకు అండగా నిలిచేందుకు కేంద్రం మరోసారి సిద్దమవుతోంది. ఈసారి కేంద్ర బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి కేటాయింపులు భారీగా పెరగనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే సంకేతాలు వెలువడుతున్నాయి. అదే జరిగితే గత ఆరేళ్లలో తొలిసారి ఈ స్ధాయిలో వ్యవసాయ రంగానికి కేటాయింపులు ఉంటాయని సమాచారం.గ్రామీణ ఆదాయం పెంపు, ధరల తగ్గింపు లక్ష్యంగా వ్యవసాయ రంగానికి ఇచ్చే కేటాయింపుల్ని 15 శాతానికి పైగా పెంచాలని కేంద్రం భావిస్తోంది. ఈసారి బడ్జెట్ లో ఈ మేరకు వ్యవసాయ రంగానికి దాదాపు లక్షా 75 వేల కోట్ల నిధులు కేటాయిస్తారని సమాచారం. ఈ సంవత్సరం లక్షా 52 వేల కోట్ల కేటాయింపులు వ్యవసాయ రంగానికి చేశారు. దాన్ని లక్షా 75 వేల కోట్లకు పెంచుతారని తెలుస్తోంది. అలాగే ఈ అదనపు కేటాయింపుల్ని కీలక అంశాలకు కేటాయించనున్నారు.

మరోవైపు బియ్యం, గోధుమలు, చక్కెర ఉత్పత్తిలో ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఉత్పత్తిదారుగా ఉన్న భారతదేశం గతేడాది అక్టోబర్ లో ఏటా 10 శాతం దాటిపోయిన ఆహార ధరలతో ఇబ్బందులు పడుతోంది. దీంతో కేంద్రం ఈ మార్పుల్ని బడ్జెట్ లో ప్రతిపాదించబోతోంది. ఇప్పటికే కేంద్రం పెరుగుతున్న ధరల నియంత్రణకు కొన్ని పప్పు ధాన్యాల సుంకం రహిత దిగుమతి విధానాన్ని పొడిగించడంతో పాటు గోధుమలతో సహా కొన్ని వ్యవసాయ ఉత్పత్తులపై ఎగుమతిపై ఆంక్షలు కూడా విధించింది. వ్యవసాయ ఎగుమతులను 2030 నాటికి 50 బిలియన్ డాలర్ల నుండి 80 బిలియన్ డాలర్లకు పెంచడానికి ప్రభుత్వం మిగులు ఉత్పత్తి చేయాలని కూడా ప్రయత్నిస్తోంది.దీని కోసం ఈసారి బడ్జెట్ లో కీలక ప్రతిపాదనలు చేయనున్నట్లు తెలుస్తోంది.