కోల్‌కతా: బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్‌లో హిందూ ఆలయాలపై కొద్దికాలంగా వరుస దాడులు జరుగుతున్నాయి. తాజాగా అక్కడ భారత దేశ జెండాను తొక్కుతూ అవమానించారు. ఈ క్రమంలోనే పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో జేఎన్ రే ఆసుపత్రి కీలక నిర్ణయం తీసుకుంది. బంగ్లాదేశ్ చెందిన రోగులకు ట్రీట్మెంట్ చేయబోమని ప్రకటించింది. బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు, భారత దేశ జెండాను తొక్కుతూ అవమానించారని అందుకే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈరోజు నుంచి నిరవధిక సమయం వరకు బంగ్లాదేశ్ రోగులను చికిత్స కోసం చేర్చుకోబోమని మేం నోటిఫికేషన్ జారీ చేశాం. భారతదేశం పట్ల వారు చూపిన అవమానాల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని అన్నారు.
కాగా, శుక్రవారంనాడు బంగ్లాదేశ్‌లో కొందరు దుండగులు మూడు ఆలయాలపై దాడులకు పాల్పడ్డారు. హరీష్ చంద్ర మున్సిఫ్ లేన్ ఏరియాలో సనాతనేశ్వరి మాత్రి ఆలయం, షోని ఆలయం, సనాతనేశ్వరి కాలిబరి టెంపుల్‌పై దుండగులు ఇటుకలు విసురుతూ..హిందూ-ఇస్కాన్ వ్యతిరేక నినాదాలు చేశారు. దాడి ఘటనను కొత్వాలి పోలీస్ స్టేషన్ చీఫ్ అబ్దుల్ కరీమ్ ధ్రువీకరించారు. నష్టం తక్కువే అయినా ఉద్రిక్తతలు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయన్నారు. ఆలయ కమిటీ సభ్యులు తపన్ దాస్ మాట్లాడుతూ, జుమా ప్రార్థనల అనంతరం వందలాది మంది హిందూ-ఇస్కాన్ వ్యతిరేక నినాదులు చేశారని, పరిస్థితి విషమించడంతో ఆర్మీని పిలిపించడంతో పరిస్థితి సద్దుమణిగిందని చెప్పారు.
మరోవైపు కోల్‌కతాలోని తమ డిప్యూటీ హైకమిషన్ కార్యాలయం వెలుపల నిరసనలు వ్యక్తం కావడంపై బంగ్లాదేశ్ ఆందోళన వ్యక్తం చేసింది. తమ దౌత్య కార్యాలయాలకు భద్రత కల్పించాలని భారత్‌కు విజ్ఞప్తి చేసింది.