మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జనసేన 12వ ఆవిర్భావ సభలో పాల్గొన్న ఆయన, జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్వశక్తితో ఎదిగిన నాయకుడని కొనియాడారు. అయితే, జగన్ మాత్రం తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణాన్ని రాజకీయ లబ్ధికి ఉపయోగించుకుని సీఎం అయ్యారని ఆరోపించారు. తన రాజకీయ జీవితాన్ని, గతంలో జగన్ కోసం తీసుకున్న నిర్ణయాలను ప్రస్తావిస్తూ బాలినేని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
“నా ఆస్తి పోయింది.. జగన్ మాత్రం మరింత సంపాదించారు”
రాజకీయాల్లోకి వచ్చాక తన తండ్రి ఆస్తిలో సగానికి పైగా పోగొట్టుకున్నానని బాలినేని అన్నారు. కానీ, జగన్ మాత్రం తన ఆస్తులతో పాటు వియ్యంకుడి ఆస్తులను కూడా స్వాహా చేసుకున్నారని ఆరోపించారు. జగన్ పాలనలో తనకు జరిగిన అన్యాయం మరెవరికి జరగకూడదని, తనకు తెలిసిన అన్ని నిజాలు ఒక్కొక్కటిగా బయట పెడతానని హెచ్చరించారు. రాజకీయంగా ఎంతటి పోరాటం ఎదురైనా వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

“జగన్‌కు రాజశేఖర్ రెడ్డి ఆశీర్వాదం, పవన్ కల్యాణ్ స్వశక్తి”
బాలినేని మాట్లాడుతూ, దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనకు రాజకీయ భిక్ష పెట్టారని, అందుకే జగన్ వెంటే నడిచానని గుర్తు చేసుకున్నారు. కానీ, జగన్ తనను మోసం చేసి మొదట మంత్రి పదవి ఇచ్చి, తర్వాత తీసేశారని ఆరోపించారు. పవన్ కల్యాణ్ గురించి జగన్ చేసిన వ్యాఖ్యలపై కూడా తీవ్రంగా స్పందించారు. “పవన్ కల్యాణ్ కౌన్సిలర్ స్థాయి నాయకుడు” అనే జగన్ వ్యాఖ్యలను ఎద్దేవా చేస్తూ, “జగన్ స్వయంకృషితో ఎదిగిన నాయకుడు కాదు, తన తండ్రి దయతో సీఎం అయ్యాడు” అని ధ్వజమెత్తారు.
“కూటమి ఓపిక పడింది.. నేను ఉంటే లోపల వేసేవాడిని”
పవన్ కల్యాణ్ పోరాట శక్తిని ప్రశంసించిన బాలినేని, వైసీపీ పాలనలో జరిగిన అరెస్టుల గురించి ప్రస్తావించారు. పోసాని కృష్ణమురళీ, వల్లభనేని వంశీల అరెస్టుల సమయంలో జగన్ వెంటనే పరామర్శకు వెళ్లారని, అదే సమయంలో కుటుంబ సభ్యులను తిడితే ఎవ్వరూ ఊరుకోరని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం ఆరు నెలలు ఓపిక పట్టిందని, తాను అధికారంలో ఉంటే ప్రజలకు నష్టం కలిగించిన వారిని లాఠీతో కొట్టి లోపల వేయించే వాడినని వ్యాఖ్యానించారు.