పాలమూరులో గత రెండు రోజులుగా నిర్వహిస్తోన్న రైతు పండుగకు సీఎం రేవంత్ రెడ్డి నేడు హాజరుకానున్నారు. లక్ష మంది రైతులతో నిర్వహించే ఈ సభ కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇవాళ సభలో సీఎం ప్రకటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రైతు భరోసా ఎప్పటి నుంచి అమలు చేస్తారు? ఎన్ని ఎకరాలకు ఇస్తారు? అనే విషయాలపై సీఎం స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని సమాచారం.
తెలంగాణలో రైతులు.. ఈరోజు రుణమాఫీ మనీ పంపిణీ ఎప్పుడు ప్రారంభిస్తారా అని ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే.. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.. ఇవాళ రుణమాఫీ అమలవుతుందని మొన్ననే ప్రకటించారు. 3 లక్షల మంది రైతులకు రూ.2లక్షల చొప్పున రుణం మాఫీ చేస్తామని అన్నారు.సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేశాకే ప్రారంభించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది అని తెలిసింది. సీఎం ప్రకటించాలంటే.. మధ్యాహ్నం అయిపోతుంది. ఎందుకంటే.. ఆయన ఇవాళ మహబూబ్‌నగర్ జిల్లాలో జరుగుతున్న రైతు పండుగ 3వ రోజు కార్యక్రమాల్లో పాల్గొని, ప్రసంగిస్తారు. ఆ ప్రసంగంలో రుణమాఫీపై ప్రకటన చేస్తారని తెలుస్తోంది. ఆ తర్వాతే రుణమాఫీని అమలు చేస్తారని అంటున్నారు. అదే జరిగితే, అకౌంట్లలోకి డబ్బు రావడానికి ఇవాళ సాయంత్రం అవ్వొచ్చు లేదా.. డిసెంబర్ 1న ఆదివారం కాబట్టి.. డిసెంబర్ 2న మనీ వచ్చే అవకాశాలు ఉంటాయి.
అలాగే ఈ రైతు పండుగలో పాల్గొని, రుణమాఫీతోపాటూ.. రైతులకు ఇస్తామన్న ధాన్యం క్వింటాలుకి రూ.500 బోనస్, అలాగే.. సంవత్సరానికి రైతులకు ఎకరానికి రూ.15,000 ఇస్తామన్న రైతు భరోసాపై ప్రకటన చేస్తారని రైతులు ఆసక్తిగా ఉన్నారు. ఈ ప్రకటనలేవీ చెయ్యకపోతే మాత్రం రైతులు తీవ్ర నిరాశ చెందుతారు. ఎందుకంటే.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక.. రైతు బంధును కొద్ది మంది రైతులకు ఇచ్చింది. ఆ తర్వాత ఈ పథకంలో అక్రమాలు ఉన్నాయని చెప్పి, దాన్ని పక్కన పెట్టింది. దాని బదులు రైతు భరోసా అమలుచేస్తామని చెప్పింది. ఖరీఫ్ అయిపోయి, రబీ సీజన్ కూడా మొదలైపోయింది. ఇంకా రైతు భరోసా మనీ ఇవ్వలేదు. ఇప్పుడేమో త్వరలోనే ఇస్తామని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నా.. ఎప్పుడు ఇస్తారో కచ్చితమైన డేట్ లేదు. మరి సీఎం రేవంత్ ఈరోజు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో..? ఎలాంటి హామీలు ఇస్తారో చూడాలి.