భారతదేశంలో మూడు హెచ్ఎంపీవీ కేసులు ధృవీకరించబడిన తర్వాత ఈ వైరస్ వ్యాప్తి గురించి పెరుగుతున్న ఆందోళనలపై కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా స్పందించారు. సోమవారం ఆయన ఒక వీడియో సందేశంలో ఈ వైరస్ కొత్తది కాదని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
సోషల్ మీడియాలో హెచ్ఎంపీవీ వైరస్ సంబంధించి #lockdown వంటి హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండ్ అవుతున్న నేపథ్యంతో, జేపీ నడ్డా ఈ అంశంపై స్పష్టతనిచ్చారు. “ప్రభుత్వం ఈ పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తోంది. ప్రజల భద్రతను నిర్ధారించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటోంది” అని ఆయన తెలిపారు.
“హెచ్ఎంపీవీ 2001లోనే గుర్తించబడినది. ఇది చాలా సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందుతూ ఉంది. ఈ వైరస్ శ్వాసకోశ సంబంధ వ్యాధులు కలిగించగలదు. సాధారణంగా ఇది శీతాకాలం మరియు వసంత ఋతువుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. అన్ని వయసుల వారు ఈ వైరస్‌కి గురయ్యే అవకాశం ఉంది,” అని జేపీ నడ్డా వివరించారు.

చైనాలో ఇటీవల హెచ్ఎంపీవీ కేసులు నమోదైనట్లు నివేదికలు చెబుతున్నాయి. భారత ప్రభుత్వం, ఐసీఎంఆర్, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఈ విషయాన్ని పరిశీలిస్తున్నాయని నడ్డా తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఈ పరిస్థితిని గుర్తించి త్వరలో నివేదికను పంచుకోనున్నదని ఆయన చెప్పారు.
భారతదేశంలో మూడు కేసులు
భారతదేశం సోమవారం మూడు హెచ్ఎంపీవీ కేసులను ధృవీకరించింది. కర్ణాటకలోని బెంగళూరులో రెండు కేసులు, గుజరాత్‌లోని అహ్మదాబాద్లో ఒక కేసు నమోదయ్యాయి.
హెచ్ఎంపీవీ అనేది సాధారణ శ్వాసకోశ వైరస్. ఇది సాధారణంగా తేలికపాటి జలుబు లక్షణాలను కలిగించగలదు. ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన శ్వాసకోశ ఇన్ఫెక్షన్లలో 4-16 శాతం వాటాను ఈ వైరస్ కలిగి ఉంది. నవంబర్ నుంచి మే వరకు ఈ కేసులు ఎక్కువగా కనిపిస్తాయి.
“బలహీన రోగనిరోధక వ్యవస్థ ఉన్నవారికి, చిన్న పిల్లలకి ఈ వైరస్ కారణంగా తీవ్రమైన సమస్యలు రావచ్చు. అయితే, భారతదేశంలో సాధారణ శ్వాసకోశ వైరస్ లో ఎటువంటి పెరుగుదల గమనించలేదు,” అని నడ్డా అన్నారు.
“జనవరి 4న జరిగిన సమావేశంలో దేశంలోని ఆరోగ్య వ్యవస్థలు, నిఘా నెట్వర్క్‌లు అప్రమత్తంగా ఉండి పని చేస్తున్నాయని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నడ్డా స్పష్టం చేశారు. “మేము పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నాము. దేశం పూర్తిగా సిద్ధంగా ఉంది” అని ఆయన తెలిపారు.