సైఫ్ అలీఖాన్‌పై దాడి కేసులో ప్రధాన నిందితుడి అరెస్ట్: సంచలన నిజాలు వెలుగు బాలీవుడ్ ప్రముఖ నటుడు సైఫ్ అలీఖాన్‌పై కత్తితో దాడి చేసిన ఘటనకు సంబంధించి ప్రధాన నిందితుడు అరెస్టైందని ముంబై పోలీసులు ప్రకటించారు. ఈ రోజు ఉదయం థానే ప్రాంతంలో నిందితుడిని అదుపులోకి తీసుకుని, తర్వాత ముంబై పోలీసులు మీడియాతో కీలక విషయాలను వెల్లడించారు.ఈ కేసులో అరెస్టైన వ్యక్తి మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షాజాద్ (వయసు 30) అనే బంగ్లాదేశీయుడు. అతడు అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించి తన పేరును విజయ్ దాస్‌గా మార్చుకున్నట్లు పోలీసులు తెలిపారు. కొద్ది నెలల క్రితం ముంబైకి వచ్చిన ఈ నిందితుడు హౌస్‌కీపింగ్ ఏజెన్సీలో చేరి పనిచేయడం ప్రారంభించాడు.
దొంగతనం చేయాలన్న ఉద్దేశంతోనే అతడు సైఫ్ ఇంట్లోకి ప్రవేశించి, అడ్డుగా వచ్చిన సైఫ్‌పై కత్తితో దాడి చేసినట్లు పోలీసులు వెల్లడించారు.ఈ కేసులో నిందితుడిని పట్టుకోవడంలో ముంబై పోలీసులు, క్రైం బ్రాంచ్ టీం 72 గంటల పాటు ముమ్మరంగా శ్రమించాయి. 30 ప్రత్యేక బృందాలు కలిపి 15కి పైగా నగరాల్లో గాలింపు చేపట్టగా, 100 మందికి పైగా అధికారులు ఇందులో పాల్గొన్నారు. చివరకు థానేలో నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు.సైఫ్ ఇంట్లోకి నిందితుడు ఎలా ప్రవేశించాడు, అసలు అతడి లక్ష్యం ఏమిటి అనే అంశాలపై ఇంకా ప్రాథమిక దర్యాప్తు కొనసాగుతోందని డీసీపీ వెల్లడించారు. నిందితుడిని కోర్టులో హాజరుపర్చిన తర్వాత పోలీసు కస్టడీకి తీసుకుని మరింత సమాచారం రాబడతామని చెప్పారు.
2025 జనవరి 16న బాంద్రా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ దాడిలో సైఫ్ అలీఖాన్ శరీరంపై ఆరు చోట్ల తీవ్ర గాయాలు అయ్యాయి. రెండు గాయాలు లోతైనవిగా ఉండగా, సర్జరీ ద్వారా సైఫ్ శరీరం నుంచి రెండున్నర అంగుళాల కత్తిని తొలగించారు. ప్రస్తుతం ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సైఫ్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ దాడి ఘటనపై మీడియా, బాలీవుడ్ అభిమానులలో తీవ్ర చర్చ జరుగుతోంది. నిందితుడి కఠిన శిక్ష కోసం ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.