దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని బాంద్రా ప్రాంతం అంటే.. అక్కడ చాలా పెద్ద పెద్ద సెలబ్రిటీలు నివసిస్తూ ఉంటారు. అయితే సెలబ్రిటీల నివాసాలు అంటే హై సెక్యూరిటీ ఉంటుంది. అక్కడ నిఘా, బందోబస్తు కూడా పటిష్ఠంగానే ఉంటుంది. కానీ బాంద్రాలో కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు.. సెలబ్రిటీలకు తీవ్ర ఆందోళనకరంగా మారుతున్నాయి. ఎన్సీపీ నేత, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీని అతి దారుణంగా నడిరోడ్డుపై హత్య చేయడం.. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఇంటి ముందు కాల్పులు, బెదిరింపులు.. తాజాగా సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి ఆగంతకుడు చొరబడి ఆయనపై తీవ్రంగా దాడి చేయడంతో ఇప్పుడు బాంద్రా పేరు మారుమోగిపోతోంది.

సైఫ్ అలీ ఖాన్‌పై దాడి జరిగిన తర్వాత.. ముంబైలో భద్రతపై ప్రియాంక చతుర్వేది పలు ప్రశ్నలు లేవనెత్తారు. సైఫ్ అలీ ఖాన్‌పై దాడి జరగడం.. ముంబై పోలీసులపై, రాష్ట్ర హోంమంత్రిపై మరోసారి ప్రశ్నలను లేవనెత్తుతోందని ఆమె పేర్కొన్నారు. పెద్ద పెద్ద వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని వారిపై దాడులు చేస్తూ.. ముంబై నగరాన్ని బలహీనపరిచే ప్రయత్నం జరగడాన్ని ఈ ఘటన చూపిస్తుందని తెలిపారు. మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ దారుణ హత్య తర్వాత.. ఇప్పటికీ ఆయన కుటుంబం న్యాయం కోసం ఎదురు చూస్తోందని మండిపడ్డారు. హై ప్రొఫైల్ ప్రాంతం అయిన బాంద్రాలోనే ఇలాంటి పరిస్థితులు ఉంటే ఇక నగరంలోని మిగిలిన ప్రాంతాలు, సాధారణ ప్రజలకు రక్షణ ఏది అంటూ దేవేంద్ర ఫఢ్నవీస్ నేతృత్వంలోని మహాయుతి కూటమి ప్రభుత్వంపై ప్రతిపక్ష ఉద్ధవ్ ఠాక్రే శివసేన పార్టీ తీవ్రంగా మండిపడుతోంది.