కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని వాంకిడి గిరిజన అశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్‌కి గురై గత కొన్ని రోజులుగా నిమ్స్‌లో చికిత్స పొందుతున్న విద్యార్థిని శైలజ సోమవారం మృతి చెందిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 30న వాంకిడి ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరగగా 64 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ముగ్గురు పరిస్థితి సీరియస్‌గా ఉండడంతో హైదరాబాద్‌లోని నిమ్స్‌లో చేర్పించారు. వీరిలో ఇద్దరు కోలుగా శైలజ పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందించారు.
దాదాపు 20 రోజులుగా చికిత్స పొందిన ఆమె చివరకు ప్రాణాలు వదిలింది. ఈ క్రమంలో శైలజ కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం తక్షణ సాయంగా రూ.1.20 లక్షల సాయం అందజేసింది. దీంతో పాటు రెండెకరాల భూమి, ఇందిరమ్మ ఇల్లు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తానని ఎమ్మెల్సీ విఠల్ హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీ హామీతో గ్రామస్థులు నిన్న శైలజ అంత్య క్రియలు పూర్తి చేశారు.
అంతకు ముందు కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. కలుషిత ఆహారం తిని తొమ్మదో తరగతి విద్యార్థిని శైలజ మృతిచెందడం రాజకీయ రగడకు దారి తీసింది. విద్యార్థిని మృతిపై బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. బాలిక మరణిస్తే పరామర్శించేందుకు అనుమతి ఇవ్వడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. మీడియా, ప్రజాప్రతినిధులకు వాంకిడి మండలం దాబా గ్రామానికి పోలీసులు అనుమతించకుండా అడ్డుకుంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో నియంత పాలన సాగుతోందంటూ కేటీఆర్ ధ్వజమెత్తారు. ఫుడ్ పాయిజన్ వల్ల చనిపోయిన బాలిక గ్రామంలోకి నో ఎంట్రీ అంటున్నారని కేటీఆర్ మండిపడ్డారు.
ఇక మంగళవారం నారాయణపేట జిల్లా మాగనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యా హ్న భోజనం తిన్న గంట తర్వాత 40మంది వాంతులు, విరేచనాలతో తరగతి గదుల్లోనే కుప్పకూలారు. కడుపునొప్పితో విలవిల్లాడారు. వెంటనే వారిని ప్రాథమిక వైద్య కేంద్రానికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న 28 మందిని మక్తల్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఇలా వరుసగా ప్రభుత్వ హాస్టల్స్ లలో ఫుడ్ పాయిజన్ ఘటనలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శలపాలు చేస్తుంది.