తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల పంపిణీకి ఏర్పాట్లు చేస్తోంది. ఇందు కోసం ఇప్పటికే లబ్ది దారుల నుంచి సేకరించిన దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసింది. అన్ని జిల్లాలకు అర్హుల జాబితా ను పంపింది. గ్రామ, బస్తీ సభల ద్వారా అభ్యంతరాలు స్వీకరించనుంది. ఆ తరువాత 26వ తేదీ నుంచి జారీ ప్రక్రియ ప్రారంభం కానుంది. కార్డుల పైన సీఎం రేవంత్.. మంత్రి ఉత్తమ్ సంతకాలు ఉండేలా నిర్ణయించారు.
ఎంతో కాలంగా కొత్త రేషన్ కార్డుల కోసం లబ్దిదారులు వేచి చూస్తున్నారు. తాజాగా ప్రభుత్వం అర్హులైన లబ్దిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. రాష్ట్రవ్యాప్తంగా 6.68 కుటుంబాలు నూతన కార్డులను పొందడానికి అర్హమైనవిగా పౌర సరఫరాల శాఖ ప్రాథమికంగా నిర్ధారించింది. అర్హుల జాబితాను రాష్ట్రంలోని 33 జిల్లాలకు పంపించింది. ప్రభుత్వ నిర్ణయం మేరకు ఈ నెల 20 నుంచి 24 వరకు 4 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, బస్తీ సభలు నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది.

గ్రామ సభల్లో గ్రామ, బస్తీ సభల్లో లబ్దిదారుల నుంచి అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత తుది జాబితాను ఖరారు చేయనున్నారు ఇలా జిల్లా కలెక్టర్ల ద్వారా వచ్చే జాబితాల మేరకు పౌర సరఫరాల శాఖ కార్డులను మంజూరు చేయనుంది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు రేషన్ కార్డు అనుసంధానం చేయనున్నారు. కొత్త కార్డులు కావాలన్న వారి, ఇప్పటికే ఉన్నకార్డుల్లో పేర్ల నమోదుకు దరఖాస్తు చేసుకున్న వారి సమాచారాన్ని అధికారులు స్క్రూటినీ చేసి జాబితాలను సిద్దం చేసారు. పంపిణీ వేళ అధికారుల కసరత్తు తరువాత కొత్త కార్డులకు 6,68,309 కుటుంబాలు అర్హమైనవిగా ప్రాథమికంగా గుర్తించారు. ఈ అన్ని కుటుంబాల్లో కలిపి 11,65,052 మంది పేర్లు ఉన్నాయి. గ్రామ, బస్తీ సభల తర్వాత కొత్త కార్డులు, అందులో లబ్ధిదారుల సంఖ్యలో హెచ్చు తగ్గులు ఉండే అవకాశం ఉంది.