రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డులు.. ఇవీ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం జనవరి 26న ప్రారంభిస్తున్న పథకాలు. ఒకేసారి 4 పథకాలు ప్రారంభం కావడం మామూలు విషయం కాదు. ఇది ప్రతిపక్ష బీఆర్ఎస్‌కి పెద్ద షాక్ లాంటిదే. ఎందుకంటే.. పథకాల లబ్ది పొందేవారు.. కాంగ్రెస్‌కి దగ్గరవుతారు. ఇది రాజకీయంగా కాంగ్రెస్‌కి కలిసొస్తుంది. పథకాలు అమలవ్వట్లేదని విమర్శిస్తున్న బీఆర్ఎస్‌కి ఇది ఇబ్బంది కలిగించే అంశం. ఈ 4 పథకాలకు సంబంధించి లబ్దిదారుల జాబితాలు రెడీ అయ్యాయి. 16,348 గ్రామ సభల్లో లబ్దిదారుల పేర్లను అధికారులు చదివి వినిపించారు. జనవరి 26న సీఎం రేవంత్ రెడ్డి.. 4 పథకాలు ప్రారంభించాక.. వెంటనే జిల్లాల పర్యటనలు మొదలవుతాయి.

ఎక్కడికక్కడ సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలూ, అధికారులూ.. జిల్లాల్లో పర్యటిస్తూ.. లబ్దిదారులకు నాలుగు పథకాల ప్రయోజనాలను స్వయంగా అందిస్తారు. సీఎం హైదరాబాద్ దగ్గర్లోని ఏదైనా గ్రామానికి వెళ్లడం లేదా.. తన జిల్లా అయిన మహబూబ్ నగర్ జిల్లాకి వెళ్లే ఛాన్స్ ఉంది.
ఎవరైనా పథకాల లబ్దిదారుల జాబితాలో తమ పేరు లేదనుకుంటే, ప్రజాపాలనలో తిరిగి దరఖాస్తు పెట్టుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. పథకాల వివరాలు చూస్తే.. రైతు భరోసా కింద.. వ్యవసాయ యోగ్యమైన భూములు ఉన్న రైతులకు సంవత్సరానికి ఎకరానికి రూ.12,000 చొప్పున ప్రభుత్వం ఇవ్వబోతోంది. అలాగే భూమి లేని రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద సంవత్సరానికి రూ.12,000 ఇవ్వబోతోంది. ఇందులో తొలి విడతగా జనవరి 26న రూ.6,000 చొప్పున ఇవ్వనుంది.
ఇందిరమ్మ ఇళ్ల విషయానికి వస్తే.. స్థలం ఉన్న వారికి ఇల్లు కట్టుకునేందుకు రూ.5,00,000 చొప్పున ప్రభుత్వం 4 విడతల్లో మనీ ఇస్తుంది. ఇలా తొలి దశలో ఈ పథకంలో భాగంగా.. నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున నిర్మాణానికి మనీ ఇవ్వనుంది. ఇక 40 లక్షల మందికి లబ్ది చేకూరేలా.. కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతోంది.