ఈ సంవత్సరం జనవరి 26న జరగనున్న రిపబ్లిక్ డే పరేడ్ భారత సైనిక శక్తి,సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటనుంది. రాజ్యాంగానికి 75 ఏళ్లు పూర్తి కావడాన్ని పురస్కరించుకొని,ప్రత్యేక దేశ భౌతిక వైభవాన్ని ప్రదర్శించనున్నారు. దాదాపు 5,000 మంది కళాకారులు ఢిల్లీలోని విజయ్ చౌక్ నుంచి సీ-హెక్సాగన్ వరకు జరిగే ఈ పరేడ్‌లో పాల్గొంటారు.గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో సైనిక సంపత్తిని ప్రదర్శించడం భారత త్రివిద దళాలకు ఆనవాయితీ.ఈసారి కూడా శత్రు దేశాల వెన్నులో వణుకు పుట్టించే ఆయుధాలు, క్షిపణులను పరిచయం చేయనున్నారు. ముఖ్యంగా, పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ప్రళయ్ క్షిపణి ప్రదర్శన ఈ పరేడ్‌లో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.

రక్షణ శాఖ కార్యదర్శి ఆర్ఎస్ సింగ్ సోమవారం మీడియా సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రళయ్ క్షిపణుల చేరికతో భారత రక్షణ వ్యవస్థ మరింత బలోపేతం అయ్యింది. ఈ పరేడ్‌లో బ్రహ్మోస్ క్షిపణులు, మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచర్లు, టీ-90 ట్యాంకర్లు, నాగ్ క్షిపణులతో పాటు ప్రళయ్ క్షిపణిని ప్రదర్శిస్తారు.పాక్, చైనా లాంటి శత్రు దేశాలు భారత భూభాగంపై చెడు చూపు వేస్తున్నాయి. ఆర్థిక, సైనిక స్థాయిలో భారత్‌ను దెబ్బతీయడానికి కుట్రలు చేయడం కొత్తేమీ కాదు. తాజాగా బంగ్లాదేశ్ కూడా భారత్‌పై విమర్శనాస్త్రాలు సంధిస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో ఇండియన్ ఆర్మీ ప్రతిస్పందనగా తన ఆయుధ సంపత్తిని పెంపొందించుకుంటోంది.
ఇందులో భాగంగా అభివృద్ధి చెందిన అద్భుత ఆయుధం ప్రళయ్ క్షిపణి. డీఆర్‌డీవో విజయవంతమైన పరీక్షల అనంతరం ప్రళయ్ క్షిపణులు భారత అమ్ముల పొదిలో చేరాయి. 150 నుంచి 500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యం ఈ క్షిపణుల సొంతం. భూతలం నుంచి భూతలం పైకి, లేదా నేల నుంచి నింగిపైకి ఈ క్షిపణులను ప్రయోగించవచ్చు.
ఇవి అత్యంత కచ్చితత్వంతో తక్కువ దూరంలోని టార్గెట్‌లను చేధిస్తాయి.ప్రళయ్ క్షిపణులను మొబైల్ లాంచర్లతో ప్రయోగించవచ్చు. క్వాసీ బాలిస్టిక్ క్షిపణుల పిలువబడే ఇవి బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణుల లక్షణాలను కలిగి ఉంటాయి. దేశ ఉత్తర సరిహద్దులను బలోపేతం చేయడంలో ఇవి కీలక పాత్ర పోషించనున్నాయి.ఈ రిపబ్లిక్ డే పరేడ్ భారత ఆత్మనిర్భరతకు నిదర్శనం. ప్రళయ్ క్షిపణి ప్రదర్శనతో ప్రపంచానికి మన సైనిక శక్తి, సాంకేతిక ఆధిక్యం మరింత స్పష్టంగా కనిపించనుంది.